Begin typing your search above and press return to search.

జనసేన-బీజేపీ.. అసలు బలమెంత?

By:  Tupaki Desk   |   17 Jan 2020 5:50 AM GMT
జనసేన-బీజేపీ.. అసలు బలమెంత?
X
కమ్యూనిస్టుల కాడి వదిలిన జనసేనాని పవన్.. కమలదళం చేయి పట్టుకున్నారు. ఏపీలో చుక్కాని లేని నావలా తయారైన బీజేపీ స్టార్ క్యాంపెయినర్ దొరికాడని అదిమి పట్టుకుంది. ఇంకేముంది నిన్న ఫైన్ మార్నింగ్ జనసేన-బీజేపీ ఒక్కటయ్యాయి. ఏపీలో తృతీయ ప్రత్యామ్మాయం తామేనని ప్రకటించేశాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకూ బీజేపీ-జనసేన కలిసి నడుస్తామని.. ఏపీలో అధికారం తమదేనని చాటింపేశాయి. నిజానికి ఏపీలో బీజేపీ-జనసేన కలవగానే అధికారం ప్రాప్తిస్తుందా? ప్రజల్లో వీరి బలమెంత? బలగమెంత? ఈ కూటమికి ఏపీలో అధికారంలోకి వచ్చే సామర్థ్యముందా అన్న ప్రశ్న తలెత్తకమానదు..

*బీజేపీ బలమెంత?

గత ఏడాది మేలో జరిగిన ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో బట్టలు చింపుకున్నట్టు ప్రచారం చేసినా బీజేపీకి వచ్చిన ఓట్లు అక్షరాల 2.64లక్షలు. ఏపీలో నోటాకు వచ్చిన ఓట్లే 4.01 లక్షలు. కేవలం నోటాకు వచ్చినట్టు ఓట్లలో సగం కూడా బీజేపీకి రాలేదన్నమాట.. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని కాంగ్రెస్ లాగే భూస్థాపితం చేశారు ఏపీ ఓటర్లు. ఇక బీజేపీలో స్టార్ క్యాంపెయినర్ లేరు. కన్నా - పురంధేశ్వరి - జీవీఎల్ - సోము వీర్రాజు - విష్ణు లాంటి మామూలు నేతలు తప్పితే జగన్ - చంద్రబాబులా నడిపించే నేత కొరత తీవ్రంగా ఉంది.

*జనసేనానికి ప్రజా బలం శూన్యమే..

తొలి సారి పొత్తులేకుండా ఒంటరిగా పోటీచేసిన జనసేనాని మొన్నటి ఏపీ ఎన్నికల్లో సాధించిన ఓట్లు 16.76లక్షలు. ఇందులో కొత్త ఓటర్లు - యువత వేసినవే ఎక్కువ. సరాసరి 5శాతం ఓట్లు జనసేనకు పడ్డాయి. రెండు చోట్ల పోటీచేసినా జనసేనాని పవన్ గెలవలేకపోయారు. యువతలో పిచ్చ క్రేజ్ - ఫాలోయింగ్ ఉన్నా వాటిని ఓట్లగా మలుచుకోవడంలో పవన్ ఘోరంగా విఫలమయ్యాడు.

*రెండు కలిస్తే అధికారం ప్రాప్తిస్తుందా?

బీజేపీతో కలిసినా జనసేన బలం కేవలం 19లక్షల ఓట్లు. మరి ఈ ఇద్దరు కలిస్తే ఏపీలో అధికారం ప్రాప్తిస్తుందా? వచ్చేసారి ఏపీని కొల్లగొడుతారా అంటే కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలమైన వైసీపీ - టీడీపీని కాదని మూడో ప్రత్యామ్మాయమైన బీజేపీ-జనసేన కూటమికి అవకాశాలు తక్కువే అంటున్నారు. ఎందుకంటే ఏపీకి హోదా ఇస్తానని బీజేపీ ఇవ్వలేదు. జనసేనాని పార్ట్ టైం పాలిటిక్స్ పై జనానికి నమ్మకం లేదంటున్నారు. ఇలా ఇద్దరు పాత కాపులు కలిసినా ఏపీలో బలమైన జగన్ - చంద్రబాబులను కాదని అధికారం దక్కుతుందని అనుకోవడం అత్యాశేనని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.