Begin typing your search above and press return to search.

జ‌న‌సేన‌తో బీఎస్పీ పొత్తు!... చ‌డీచ‌ప్పుడు లేదే!

By:  Tupaki Desk   |   23 March 2019 8:44 AM GMT
జ‌న‌సేన‌తో బీఎస్పీ పొత్తు!... చ‌డీచ‌ప్పుడు లేదే!
X
ఊరిదంతా ఒక దారి అయితే.. ఉలిపిరిక‌ట్టెది మ‌రో దారి అన్న‌ట్టుంది జ‌న‌సేన ప‌రిస్థితి. పార్టీ పెట్టిన ఐదేళ్ల దాకా అస‌లు ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేందుకు సాహ‌స‌మే చేయ‌ని జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఆ ఐదేళ్ల త‌ర్వాత కూడా పోటీకి సై అంటున్నా... అది కూడా పాక్షిక పోటీ అనే చెప్పేసింది. ఏపీ వ‌ర‌కే ప‌రిమిత‌మైపోయిన జ‌న‌సేన‌... ఆ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్ల‌మెంటు స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసుకోలేని దుస్థితిలో ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే త‌న చేత‌గానిత‌నం బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండేందుకు వామ‌ప‌క్షాల‌తో పొత్తు కుదుర్చుకున్న ప‌వ‌న్‌... ఆ పార్టీల‌కు ఏకంగా 14 అసెంబ్లీ - నాలుగు ఎంపీ సీట్లను ఇచ్చేశారు. ఇక అంత‌కుముందే ఏ ఒక్క‌రూ ఊహించ‌ని విధంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని లక్నోలో తేలిన ప‌వ‌న్‌... మాయావ‌తి ఆధ్వ‌ర్యంలోని బ‌హుజ‌న స‌మాజ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రంలో హీన‌ప‌క్షంలో అయినా ఓటింగ్ ఉన్న వామ‌ప‌క్షాల‌కు కేటాయించిన సీట్ల కంటే కూడా అధిక సంఖ్య‌లో బీఎస్పీకి సీట్లిచ్చేశారు. రాష్ట్రంలో ఎక్క‌డ కూడా క‌నీసం ప్ర‌భావం చూప‌లేని ఆ పార్టీకి ప‌వ‌న్ ఏకంగా 21 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లిచ్చేశారు. ఆ జాబితాను కూడా ఆయ‌న ఆ పార్టీకి ఇచ్చేశారు. అయితే ఇక్క‌డే ఓ చిన్న మెలిక పెట్టేశారు. బీఎస్పీకి కేటాయించిన సీట్ల‌లో ఆ పార్టీ అభ్యర్థుల‌ను ప్ర‌క‌టించుకుంటే ఓకేన‌ట‌. లేదంటే తానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తాన‌ని కూడా జ‌న‌సేన చెప్పేసింది.

అయినా క‌నీసం అభ్య‌ర్థుల‌ను కూడా ఖరారు చేసుకోలేని ఆ పార్టీకి అన్ని సీట్లు ఇవ్వ‌డం ఎందుకు? ఆ పార్టీ అభ్య‌ర్థుల‌ను కూడా తానే ప్ర‌క‌టిస్తాన‌ని చెప్ప‌డం ఎందుకు? అన్ని అనుమానాలు రేకెత్తాయి. స‌రే... వారికేదో కేటాయించేశారు. ఎలాగోలా వారో, వీరో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తారు క‌దా అన్న భావ‌న వ్య‌క్తమైంది. అయితే ఇప్పుడు ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అస‌లు బీఎస్పీకి కేటాయించిన సీట్ల విష‌యంలో ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగానే వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా ఇప్పుడు స‌రికొత్త వార్త‌లు వినిపిస్తున్నాయి. బీఎస్పీకి ఏమాత్రం అనుకూలంగా లేని, క‌నీసం అభ్య‌ర్థులు కూడా దొర‌క‌ని స్థానాల‌నే ప‌వ‌న్ ఏరికోరి ఆ పార్టీకి అప్ప‌గించార‌ని కూడా ఇప్పుడు వ‌దంతులు మొద‌ల‌య్యాయి. ఈ వ‌దంతులు పూర్తిగా వ‌దంతులేన‌ని అనుకోవ‌డానికి కూడా లేదు. ఎందుకంటే... వాస్త‌వ ప‌రిస్థితులు కూడా అందుకు భిన్నంగా ఏమీ లేవు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుదల కావ‌డం, నామినేష‌న్ల దాఖ‌లుకు గ‌డువు స‌మీపిస్తుండ‌టంతో ఓ వైపు జ‌న‌సేన‌తో పాటు వామ‌ప‌క్షాలు కూడా నామినేష‌న్లు వేసేస్తుంటే... బీఎస్పీ అభ్య‌ర్థులు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

ఏకంగా 21 అసెంబ్లీ - 3 ఎంపీ సీట్ల‌లో పోటీ చేయాల్సి ఉన్న బీఎస్పీ... చ‌డీచ‌ప్పుడు లేకుండా ఎందుకున్న‌దే ఇప్పుడు అస‌లు సిస‌లు ప్ర‌శ్న‌. ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించిన తీరును ఆదిలోనే గుర్తించ‌డంలో విఫ‌ల‌మైన బీఎస్పీ... కార్య‌క్షేత్రంలోకి వెళ్లాకే ఆ విష‌యాన్ని తెలుసుకుంద‌ట‌. దీంతో ఆ పార్టీ నేత‌లు ఇప్పుడు ప‌వ‌న్ వైఖ‌రిపై నిప్పులు చెరుగుతున్న‌ట్లుగా తెలుస్తోంది. పొత్తు అంటూనే అస‌లేమాత్రం త‌మ‌కు అవ‌కాశం, అనువుగా లేని సీట్ల‌ను ఇస్తారా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. అందులో భాగంగానే త‌మ‌కు అనువుగా లేని చోట పోటీ చేయ‌లేమ‌ని, కుట్ర‌పూరితంగా ఇచ్చిన సీట్ల‌లో కూడా మీరే పోటీ చేయండి అని ప‌వ‌న్‌కు తేల్చి చెప్పిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తంగా అల్లంత దూరం వెళ్లి బీఎస్పీతో పొత్తు పెట్టుకుని వ‌చ్చి మ‌రీ ఆ పార్టీకి ఝ‌ల‌క్ ఇవ్వ‌డం ప‌వ‌న్ వ‌ల్లే సాధ్య‌మైంద‌న్న వాద‌న వినిపిస్తోంది.