Begin typing your search above and press return to search.

అధినేత ట్వీట్ లు.. కార్య‌క‌ర్త‌లు రోడ్ల మీద‌కు..

By:  Tupaki Desk   |   15 April 2017 4:26 AM GMT
అధినేత ట్వీట్ లు.. కార్య‌క‌ర్త‌లు రోడ్ల మీద‌కు..
X
కాల‌క్షేప రాజ‌కీయాలు వేరు. సీరియ‌స్ రాజ‌కీయాలు వేరు. రెండు ప‌డ‌వ‌ల మీద కాళ్లు అన్న చందంగా పాలిటిక్స్ చేయ‌టం అంత తేలికైన వ్య‌వ‌హారం కాదు. ఆ మాట‌కు వ‌స్తే..రాజ‌కీయాల్లో ఉన్నోళ్లంతా రాజ‌కీయం మాత్ర‌మే చేస్తున్నారా? అని అడ‌గొచ్చు. నిజ‌మే.. కానీ.. పార్టీకి కీల‌క‌మైన అధినేత‌కు రెండు.. మూడు వ్యాప‌కాలు ఉండ‌టం ఏ మాత్రం స‌రికాదు. అందులోకి ఉద్య‌మ రాజ‌కీయ పార్టీ అధినేత అంటే.. సీరియ‌స్ గా ఉద్య‌మం మీదా.. రాజ‌కీయాల మీదా దృష్టి ఉండాలే త‌ప్పించి.. గుర్తుకు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా రెండు ట్వీట్లు చేసేసి.. ఏదో చేస్తున్న‌ట్లుగా దులిపేసుకోవ‌టం స‌రైంది కాదు. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న‌ది ఇదే.

తానేమో షూటింగ్‌ ల‌లో బిజీ.. బిజీగా ఉంటూ.. మ‌ధ్య మ‌ధ్య‌లో హోదా మీదా.. ఏవైనా అంశాల మీదా ట్వీట్లు చేస్తూ.. ఏపీ ప్ర‌యోజ‌నాల మీద త‌న‌కున్న క‌మిట్ మెంట్‌ ను చాటి చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే.. హోదా అంశంపై తాను బ‌రిలోకి దిగుతాన‌ని.. ఇందుకోసం ఏం చేసేందుకైనా సిద్ధ‌మ‌నేన‌ని చెప్పే ఆయ‌న‌.. అందుకు భిన్నంగా ఇప్ప‌టివ‌ర‌కూ ఏమీ చేయ‌క‌పోవటాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

జ‌న‌సేనాధిప‌తి తీరు ఇలా ఉంటే.. మ‌రోవైపు.. హోదా సాధ‌న కోసం జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు ఒక‌రోజు ఆత్మ‌గౌర‌వ దీక్ష నిర్వ‌హించారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించిన దీక్ష‌కు.. ఏపీకి చెందిన 13 జిల్లాల కార్య‌క‌ర్త‌లు ఇందులో పాల్గొన‌టం గ‌మ‌నార్హం. అంబేడ్క‌ర్ ర‌చించిన రాజ్యాంగానికి పార్ల‌మెంటు సాక్షిగా తూట్లు పొడిచిన పాల‌కుల నిర్ల‌క్ష్యానికి నిర‌స‌న‌గా తాము దీక్ష చేస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు. విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకి ఇచ్చిన హామీల‌న్నింటిని అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేసిన ఆయ‌న‌.. రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా విభ‌జించింద‌ని మండిప‌డ్డారు. అధినేత ఏమో గుర్తుకు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ట్వీట్లు చేస్తుంటే.. ఆయ‌నకు త‌గ్గ‌ట్లే జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు రోడ్ల మీద‌కు వ‌చ్చి త‌మ‌కు తోచింది చేసుకుంటూ పోతున్నార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/