Begin typing your search above and press return to search.

జ‌న‌సేన కార్య‌క‌ర్త అరెస్ట్‌...ఏపీలో హైడ్రామా

By:  Tupaki Desk   |   13 July 2017 5:08 AM GMT
జ‌న‌సేన కార్య‌క‌ర్త అరెస్ట్‌...ఏపీలో హైడ్రామా
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త అరెస్టు ఏపీలో క‌ల‌క‌లానికి దారితీసింది. అవ‌నిగ‌డ్డ‌కు చెందిన స్థానిక న్యాయవాది - జనసేన కార్యకర్త రాయపూడి వేణుగోపాలరావు అరెస్టు నాటకీయ పరిణామాల మధ్య సాగింది. బుధవారం ఉదయం పెద్ద ఎత్తున పోలీసులు రాయపూడి గృహాన్ని చుట్టుముట్టి బలవంతంగా అరెస్టు చేసిన తీరు విమర్శలకు దారితీసింది. ఓ కేసు విషయమై వేణుగోపాలరావు ఇంటిని పెద్దఎత్తున పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేసిన తీరు ఈ ప్రాంత ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసింది. ఆరు గంటల పాటు పలు నాటకీయ పరిణామాల నడుమ రాయపూడిని పోలీసులు స్థానిక కోర్టులో ప్ర‌వేశ పెట్టటంతో ఉత్కంఠతకు తెరపడింది.

బుధవారం ఉదయం 9గంటల సమయంలో దాదాపు 100 మందికి పైగా పోలీసులు రాయపూడి నివాసం ఉంటున్న పరిసరాలకు బయట వారిని రానివ్వకుండా కట్టుదిట్టం చేశారు. రాయపూడి గృహం చుట్టూ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించగా సీఐతో పాటు అవనిగడ్డ - కోడూరు ఎస్‌ ఐలు రాయపూడి గృహంలోకి వెళ్లి ఆయనను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుండి సెల్‌ ఫోన్‌ లు లాక్కున్నారని, నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్న ఆయనను న్యాయవాది అని కూడా చూడకుండా తీవ్రవాదిలా అరెస్టు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాయపూడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అవనిగడ్డ పోలీసు స్టేషన్‌ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు - అభిమానులు పెద్ద ఎత్తున పోలీసు స్టేషన్‌ కు చేరుకున్నారు. ఒక దశలో ఆందోళనకు సిద్ధపడగా రాయపూడి వారిని వారించారు. మంగళవారం రాత్రి చల్లపల్లి మండలం పాగోలులో ఇళ్ల మధ్య బ్రాందీ షాపు పెట్టడాన్ని నిరసిస్తూ స్థానికులు చేపట్టిన ఆందోళనలో రాయపూడి పాల్గొని మద్దతు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పాగోలు - శ్రీనగర్ కాలనీకి చెందిన మహిళలు పెద్ద ఎత్తున కోర్టుకు చేరుకోవటంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం 4గంటల సమయంలో రాయపూడిని స్థానిక కోర్టుకు తరలించి న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా సబ్ జైలుకు రిమాండ్‌ కు తరలించారు. రిమాండ్‌ కు తరలించే సమయంలో పెద్ద ఎత్తున మహిళలు పోలీసు జీపును చుట్టుముట్టి రాయపూడిని చూసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని పంపించేశారు.

బందరు డీఎస్పీ శ్రావణ్‌ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.....ఈ ఏడాది మే 14న వైద్యసేవల విషయమై రాయపూడి వైద్యశాలకు వెళ్లి సిబ్బందిని కులం పేరుతో దూషించడంతో పాటు సిబ్బంది విధులను ఆటంకపర్చారని రాయపూడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి డీఎస్పీ శ్రావణ్‌ కుమార్ గతంలో విచారణ చేశారు. ఈ మేరకు బుధవారం రాయపూడిని అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుప‌ర్చ‌గా న్యాయమూర్తి రిమాండ్‌ కు పంపారు.