Begin typing your search above and press return to search.

జనసైనికుడి మోసం... పవన్ కల్యాణే న్యాయం చేయాలి

By:  Tupaki Desk   |   31 Aug 2019 5:24 PM GMT
జనసైనికుడి మోసం... పవన్ కల్యాణే న్యాయం చేయాలి
X
టాలీవుడ్ లో పవర్ స్టార్ గా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న పవన్ కల్యాణ్ అభిమాన దనంలోనూ అందరికంటే ఓ మెట్టు పైనే ఉన్నారని చెప్పాలి. అలాంటి పవన్ రాజకీయాల్లోకి వచ్చేస్తే... వ్యవస్థలన్నీ సమూల ప్రక్షాళన ఖాయమే కదా. ఇదే భావనతో చాలా మంది జనసేనపై గంపెడాశలు పెట్టుకుంటే... జనసైనికుడిగా, పవన్ కల్యాణ్ వీరాభిమానిగా ఉన్న పలువురు జనాన్ని నిండా ముంచేస్తున్నారు. జనసేన పేరును, పవన్ కల్యాణ్ పేరును వాడేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఈ మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకుని జనం లబోదిబోమంటున్నారు. ఇలా జనసైనికుల మోసంతో నిండా మునిగిన బాధితులు... తమకు పవన్ కల్యాణే న్యాయం చేయాలంటూ నినదిస్తుండటం నిజంగానే ఆసక్తి కలిగించేదే.

గతంలో ఇలాంటి మోసాలు జరిగితే... తాజాగా వెలుగు చూసిన మోసం మాత్రం వాటన్నింటికీ మాస్టరేనని చెప్పాలి. ఆ వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మామిడాడకు చెందిన గణేష్ అనే జనసేన పార్టీ కార్యకర్త కొద్ది రోజుల క్రితం యర్రవరంలో మాధవీలత ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఆటోలు కొనుగోలుకు లక్ష రూపాయలు కడితే అంతే మొత్తంలో జనసేన పార్టీ ఎన్ఆర్ఐ కార్యకర్తల నుండి ఉచిత సబ్సిడీ వస్తుందని డ్రైవర్లను నమ్మించాడు. గణేష్ మాటలు నమ్మి రూ.1.20 లక్షల చొప్పున చెల్లించి ఫైనాన్స్ కంపెనీల నుండి డ్రైవర్లు ఆటోలు కొనుగోలు చేశారు. అయితే బాధితులు చెల్లించిన సొమ్ములతో జన సైనికుడు గణేష్ ఉడాయించాడు. ఈఎంఐలు చెల్లించాలని ఆటో ఫైనాన్స్ కంపెనీల నుంచి ఒత్తిళ్ళు రావడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు గణేష్ చేసిన అన్యాయంపై ఆందోళనకు దిగారు. గణేష్‌తో పాటు ఆటో ఫైనాన్స్ కంపెనీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గృహ నిర్మాణాలకు కూడా సబ్సిడీ వస్తుందని సొమ్ములు వసూలు చేసినట్లు గణేష్‌పై ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో అతడి మాటలు నమ్మి 200 మందిపైగా మోసపోయినట్టు తెలుస్తోంది. జనసేన పేరు చెప్పి తమను నిలువునా ముంచిన గణేష్‌ను అరెస్ట్‌ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. అంతేకాకుండా జనసేన పార్టీ కార్యకర్త గణేష్‌ చేతిలో మోసపోయిన తమ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణే న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. జనసేన పార్టీని చూసే తాము డబ్బులు కట్టామని.... గణేష్‌తో పాటు జనసేనకు చెందిన జిల్లా నాయకులు వచ్చి తమను నమ్మించారని వాపోయారు. ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారని వారు వాపోయారు. ఈ దందాలో మోసపోయిన వారికి పవన్ ఎలాంటి న్యాయం చేస్తారో చూడాలి.