Begin typing your search above and press return to search.

జన సైనికుల వార్నింగ్స్‌ అతడి చెవికి ఎక్కేనా?

By:  Tupaki Desk   |   26 Oct 2019 5:13 AM GMT
జన సైనికుల వార్నింగ్స్‌ అతడి చెవికి ఎక్కేనా?
X
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఒకప్పుడు ఏ సినిమా చేసినా వివాదాస్పదం అయ్యేది. ఆయన వివాదాలను సృష్టించి మరీ సినిమాలకు ప్రమోషన్‌ చేసుకునేవాడు. కాని ఇప్పుడు ఆయన వివాదాలనే సినిమా నేపథ్యాలుగా ఎంచుకుంటున్నాడు. అప్పుడు ఇప్పుడు ఆయన తీరు ఒకేలా ఉంది. నన్ను అనే వారు ఎవరు.. నేను ఎవరికి భయపడను అన్నట్లుగా ఆయన తీరు కొనసాగుతుంది. మాఫియా నేపథ్యంలో చేసినా.. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో చేసినా ఆయన సినిమాలను ప్రేక్షకులు ఆధరించక పోయినా వివాదాలు మాత్రం చాలా కామన్‌ అయ్యాయి.

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంతో ఏ స్థాయిలో హాట్‌ టాప్‌ గా వర్మ నిలిచాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా తర్వాత ఇప్పుడు వర్మ చేస్తున్న సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. మొదట వర్మ ఈ సినిమాను ప్రకటించినప్పుడు అసలు సినిమా చేస్తాడో లేదో అనుకున్నారు. కాని సినిమా మొదలు పెట్టాడు.. షూటింగ్‌ కూడా పూర్తి చేయబోతున్నాడట. ప్రముఖ రాజకీయ నాయకులను ఈ చిత్రంలో చూపించబోతున్నాడు. ఏపీ రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు వర్మ పవన్‌ కళ్యాణ్‌ పాత్రను ప్రధానంగా చూపించబోతున్నట్లుగా అనిపిస్తుంది.

పవన్‌ కళ్యాణ్‌ పాత్రధారుడు స్టేజ్‌ పై రాజకీయ ప్రసంగం చేస్తుంటే నలుగురు ముద్దుగుమ్మలు హాట్‌ గా ఆయన పక్కన ఉన్నట్లుగా ఒక పోస్టర్‌ ను విడుదల చేశాడు. దాంతో పాటు నారా లోకేష్‌ పాత్రధారుడు మరియు పవన్‌ కళ్యాణ్‌ పాత్రధారుడు కలిసి మాట్లాడుకుంటున్న ఫొటోను కూడా విడుదల చేశాడు. ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌.. జనసేన కార్యకర్తలు వర్మపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. సోషల్‌ మీడియాలో వర్మను ఏకి పారేస్తున్నారు.

స్టేజ్‌ పై వర్మ మాట్లాడుతూ ఉండగా ఆయన కుటుంబ సభ్యుల ఫొటోలను పెట్టి మార్ఫింగ్‌ చేయడంతో పాటు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు సోషల్‌ మీడియాలో వర్మను దుమ్ము దులిపేస్తున్నారు. బండ బూతులతో వర్మను తిడుతున్నారు. పవన్‌ ఫ్యాన్స్‌ ఎంతగా తిట్టినా వారి నోళ్లు నొప్పి లేవాలి.. పోస్ట్‌ లు పెట్టి పెట్టి వారి వేళ్లు నొప్పి లేవాలి. అంతే తప్ప వారి విమర్శలు అస్సలు వర్మ చెవికి ఎక్కవు.

గతంలో కూడా ఇలాంటి విమర్శలు ఎన్నో వర్మ ఎదుర్కొన్నాడు. అయినా కూడా వర్మ ఏమాత్రం వెనక్కు తగ్గడు. ఎవరేం అనుకుంటే నాకేంటి.. ఎవరేం అయితే నాకేంటి అన్నట్లుగా వర్మ తీరు ఉంటుంది. అదే తీరుతో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాను తీసి విడుదల చేయబోతున్నాడు. నేడు ట్రైలర్‌ విడుదలైన తర్వాత మరెంత రచ్చ ఉంటుందో చూడాలి.