Begin typing your search above and press return to search.

600 కోట్ల చీటింగ్.. గాలిపై 4వేల పేజీల చార్జ్ షీట్

By:  Tupaki Desk   |   20 Feb 2019 7:14 AM GMT
600 కోట్ల చీటింగ్.. గాలిపై 4వేల పేజీల చార్జ్ షీట్
X
ఆంబిడెంట్ కంపెనీ రూ.600 కోట్ల మోసంలో ఉచ్చు బిగిసింది. ఈడీ కేసుల నుంచి రక్షిస్తానంటూ నమ్మించి ఆ కంపెనీ వ్యవస్థాపకుడితో రూ.20కోట్ల డీల్ కుదుర్చుకున్న మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జనార్ధన్ రెడ్డిపై సీసీబీ పోలీసులు విచారణ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది.

ఫరీద్ అనే వ్యక్తి బెంగూళూరులో ఆంబిడెంట్ కంపెనీ ఏర్పాటు చేశాడు. అక్కడి ప్రజలకు అధిక మొత్తంలో వడ్డీ ఇస్తానంటూ నమ్మబలికి 600కోట్ల మేర డబ్బులు వసూలు చేసి ముఖం చాటేశాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఆ కంపెనీ యజమాని ఫరీద్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో రాజకీయ పెద్దల హస్తం ఉండటంతో ఈ కేసును ప్రభుత్వం సీసీబీ పోలీసులకు అప్పగించింది.

అయితే ఈ కేసు నుంచి ఫరీద్ ను తప్పిస్తానంటూ మాజీ మంత్రి గాలి జనార్ధన్ అతడితో 20కోట్ల డీల్ మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. డీల్ కు సంబంధించి గాలి జనార్ధన్ రెడ్డి, ఆంబిడెంట్ కంపెనీ యాజమానికి మధ్య చర్చలు తాజ్ వెస్టెండ్ లో హోటల్లో జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆ హోటల్ లోని సిబ్బంది, గాలి జనార్దన్ ఇంటి పని మనుషులు, ఆయన సన్నిహితులను పోలీసులు విచారించారు. ఆంబిడెంట్ కంపెనీపై రూ.600కోట్ల మోసంతోపాటు 4వేల పేజిలతో కూడిన చార్జిషీటును పోలీసులు బెంగుళూరు సీసీబీ ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి గాలి జనార్ధన్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.