Begin typing your search above and press return to search.

మ‌న‌ద‌గ్గ‌రే : కార్డు ఉంటేనే మ‌ద్యం ఇస్తార‌ట‌

By:  Tupaki Desk   |   9 Dec 2016 5:12 PM GMT
మ‌న‌ద‌గ్గ‌రే : కార్డు ఉంటేనే  మ‌ద్యం ఇస్తార‌ట‌
X
పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో డిజిట‌ల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం క్రియాశీలంగా ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ క్ర‌మంలో మ‌రో ఊహించ‌ని నిర్ణ‌యం వెలువ‌డింది. జనగామను నగదు రహిత జిల్లాగా మార్చేందుకు అధికార యంత్రాంగం ప్రజలను చైతన్యం చేస్తోంది. కలెక్టర్ దేవసేన ఆదేశాల మేరకు తొలుత మద్యం షాపుల్లో నగదు రహిత లావాదేవీలకు శ్రీకారం చుట్టారు. డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారానే మద్యం కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీ వరకు నగదు చెల్లించి మద్యం కొనుగోలు చేసేందుకు అనుమతినిచ్చారు. 15 తేదీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ తీసుకుని వచ్చిన వారికి మాత్రమే లైసెన్స్‌దారులు మద్యం అమ్మకాలు జరపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పలు వైన్స్‌ల ఎదుట నోటీస్‌ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.

గత నెలలో కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రూ. 500, 1000 నోట్ల స్థానంలో రూ. 2 వేల కొత్త నోటును చెలామణీలోకి తెచ్చారు. ఆనాటి జనాలకు నోటు కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఆర్బీఐ పాత రూ. 500, 1000 నోట్ల మార్పిడి, చెలామణీ కోసం గత నెలఖారు వరకు అనుమతి ఇచ్చింది. ఇటీవల గడువు ముగియగా కేవలం పాత నోట్లను బ్యాంకులో డిపాజిట్ మాత్రమే చేసుకోవాలని ఆదేశాలిచ్చింది. జనగామ జిల్లాను నగదు రహిత లావాదేవిలు జరిగే జిల్లాగా మార్చేందుకు కలెక్టర్ దేవసేన కంకణం కట్టుకున్నారు. ఈ నెల ప్రారంభం నాటి నుంచి వ్యాపారవాణిజ్య సంస్థలు, ప్రజలను నిత్యం కలుస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 2న కలెక్టరేట్‌లో బ్యాంకర్లు, ఆయా వ్యాపార వర్గాలతో సమావేశం ఏర్పాటు చేసి నగదు రహిత జిల్లాకు సహకరించాలని కోరారు. ఇందులో భాగంగా మద్యం వ్యాపారులు స్వైపింగ్ యంత్రాలు అందజేస్తే వెంటనే నగదు రహిత లావాదేవీలు ప్రారంభిస్తామని తెలిపారు.

జిల్లాలో ప్రతినెల సుమారు రూ. 18 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో స్పందించిన కలెక్టర్ దేవసేన బ్యాంకర్లతో మాట్లాడి వారంలోగా వైన్స్ నిర్వాహకులకు యంత్రాలు అందజేయాలన్నారు. ఈ నెల 15 నుంచి నగదు రహిత లావాదేవీలు ప్రారంభించాలని వైన్స్ నిర్వాహకులను కోరినా ఆమె కేవలం డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల ద్వారానే లావాదేవీలు జరపాలని నోటీస్‌బోర్టులు తయారు చేయిస్తున్నారు. ఇది విష‌యం.