Begin typing your search above and press return to search.

హ‌రీష్ ఆప‌రేషన్...బీజేపీకి సీనియ‌ర్ గుడ్‌ బై

By:  Tupaki Desk   |   8 Jan 2018 4:04 PM GMT
హ‌రీష్ ఆప‌రేషన్...బీజేపీకి సీనియ‌ర్ గుడ్‌ బై
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు - మంత్రి హ‌రీశ్‌ రావు చేసిన ఆప‌రేష‌న్ ఫ‌లించింది. త‌న‌దైన శైలిలో జ‌రిపిన మంత్రాంగంతో బీజేపీకి సీనియ‌ర్ నేత ఒక‌రు గుడ్ బై చెప్పారు. మాజీ ఎమ్మెల్యే - బీజేపీ సీనియ‌ర్ నేత‌ల్లో ఒక‌రైన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేర‌కు ఆయ‌న అధికారికంగా ప్ర‌క‌టించారు. సోమ‌వారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా బీజేపీలో ఉన్నానని...జనగామ ప్రజల - అభిమానుల కోరిక మేరకు.. బీజేపీకి రాజీనామా చేస్తున్నానని ప్ర‌క‌టించారు.

త‌న‌తో పాటు అన్ని మండలాల్లో నాయకులు బీజేపీకి రాజీనామా చేస్తున్నార‌ని కొమ్మూరి ప్ర‌తాప్ రెడ్డి తెలిపారు. 4 ఏళ్లుగా పార్టీ అభివృద్ధి కోసం పని చేశాన‌ని... అయితే గత ఏడాది నుండి పార్టీ మారాల‌ని త‌న మీద ఒత్తిడి ఉందని ఆయ‌న వెల్ల‌డించారు. 2001 నుండి తాను తెరాసలో ఉన్నానని...జెడ్పీటీసీ -ఎమ్మెల్యే గా గెలిచానని వెల్ల‌డించారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివ‌రించారు. జనగామ బీజేపీ పార్టీలో క్రమశిక్షణ లేదని...సవరించడానికి ప్రయత్నం చేసినా కుదరలేదన్నారు. జిల్లా ప్రజల అభీష్టం మేరకు...వారు చెప్పిన విధంగా పార్టీలో చేరుతాన‌ని ప్ర‌క‌టించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికే మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యానే త‌ప్ప రాజకీయాలు మాట్లాడలేదని ఆయ‌న అన్నారు.

కాగా, కొద్దికాలంగా స్త‌బ్ధుగా ఉన్న ప్ర‌తాప్‌ రెడ్డి బీజేపీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఎంట్రీ ఇచ్చిన మంత్రి హ‌రీశ్ రావు ఆయ‌నతో మంత‌నాలు జ‌రిపి పార్టీ మారే విధంగా చేశారు. బీజేపీ పెద్ద‌లు రంగంలోకి దిగిన‌ప్ప‌టికీ...ప్ర‌తాప్‌ రెడ్డి త‌న నిర్ణ‌యం మార్చుకోలేద‌ని స‌మాచారం.