Begin typing your search above and press return to search.

అమరావతికి భవంతి విరాళం !!

By:  Tupaki Desk   |   27 Oct 2015 5:15 PM IST
అమరావతికి భవంతి విరాళం !!
X
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి దాతలు వివిధ విధాలుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో భారీ భవనాన్ని నిర్మించి ప్రభుత్వానికి ఉచితంగా ఇస్తామని జనచైతన్య గ్రూప్‌ ప్రకటించింది. జనచైతన్య గ్రూప్‌ ఛైర్మన్‌ మాదాల చైతన్య ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాజధాని ప్రాంతంలో భారీ భవంతిని నిర్మించి ఉచితంగా ఇస్తామని చెప్పారు.

26 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవంతిని నిర్మించి ప్రభుత్వానికి అప్పగించడానికి జన చైతన్య గ్రూపు అంగీకరించింది. దీన్ని గ్రూపు అధినేత మాదాల చైతన్య తన తల్లి శకుంతల పేరిట నిర్మించి ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు జనచైతన్య గ్రూప్‌ను అభినందించారు. ఆంధ్ర నుంచి పుట్టిన కంపెనీలు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తే రాజధాని ప్రపంచం గర్వించేలా తయారవుతుందని చంద్రబాబు పిలుపునిచ్చారు.

మరోవైపు అమరావతి నిర్మాణానికి ప్రజలు ఆన్ లైన్ లో ఇటుకల రూపంలో ఇస్తున్న విరాళాలు కూడా పెరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు 53,236 మంది దాతలు 34,84,759 ఇటుకలను ఆన్ లైన్లో కొనుగోలు చేశారు. దీని ద్వారా ఇంతవరకు మూడు కోట్ల రూపాయలకు పైగా సమకూరినట్లయింది.