Begin typing your search above and press return to search.

జ‌న‌సేన గెలిచే మొద‌టి సీటేదో చెప్పిన ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   8 Jun 2018 4:12 PM GMT
జ‌న‌సేన గెలిచే మొద‌టి సీటేదో చెప్పిన ప‌వ‌న్‌
X
రాజ‌కీయాల్లో ఇటీవ‌ల దూకుడు పెంచిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న వాగ్దాటిని మ‌రింత పెంచారు. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న సంచ‌ల‌న జోస్యం చెప్పారు. జ‌న‌సేన పార్టీ గెలిచే మొద‌టి సీటు ఏదో ప‌వ‌న్ తాజాగా ప్ర‌క‌టించారు. పాయ‌క‌రావుపేట‌లో నిర్వ‌హించిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ...ఇదే జ‌న‌సేన గెలిచే మొద‌టి సీటు అని ప్ర‌క‌టించారు. పాయకరావుపేటలో జనసేన పోరాట యాత్రకి స్వాగతం పలికే ఫ్లెక్సి కడుతూ ఇద్దరు జన సైనికులు మృత్యువాత పడటం తెలిసిన సంగ‌తే. మరణించిన శివ - నాగరాజుకు సంబంధించిన కుటుంబాల్ని పరామర్శించారు. తక్షణ ఆర్థిక సాయంగా మూడు లక్షల రూపాయిలను అందచేశారు. శివ భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఎంతో బాధ కలిగించిందనీ - వారి కుటుంబాలకి జనసేన అండగా నిలుస్తుందని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చెప్పారు.

అనంతరం నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “పాయకరావు పేట అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఈ ప్రాంతంలోని రాయవరం గ్రామం. గురజాడ అప్పారావు గారు జన్మించిన గ్రామం ఇది. ఈ ప్రాంతానికి రావడం సంతోషంగా ఉంది. అలాంటి సరస్వతీపుత్రుడు పుట్టిన రాయవరం గడ్డపై కనీసం జూనియర్ కాలేజీ లేకపోవడం దురదృష్టకరం. గురజాడ పుట్టిన ప్రాంతంలో అక్షరాస్యత తక్కువగా ఉందన్నారు. విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇక్కడ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.. అది ఏమైందో తెలియదు. నక్కపల్లిలో ఉన్న సెజ్ లో స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. స్థానికులు ఎటు పోవాలి. తెలుగుదేశం యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని నమ్మి అండగా ఉన్నా. ఓట్లు చీల్చవద్దు... మద్దతు ఇవ్వమని అడిగితే నమ్మి వెంట నడిచా. 2014 ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకున్నప్పుడు పాయకరావుపేట నియోజకవర్గం కూడా అందులో ఉంది. సమస్యలను అర్థం చేసుకుని జనసేన ముందుకు వెళ్తోంది. 2019 ఎన్నికల్లో పాయకరావుపేట జనసేనదే అవుతుంది`` అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

రాష్ట్రంలో భూ కబ్జాలు ఎక్కడ జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుతున్నారని - విశాఖలో భూమి ఉంటే కబ్జా చేయడమేన‌ని ఎద్దేవా చేశారు. `ఇక్కడ తాండవ నదిని కూడా తెలుగుదేశం నేతలు కబ్జా చేస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు నదులుకు నీరు ఎక్కువగా వస్తున్నా కరకట్టలు నిర్మించే పరిస్థితి లేదు. 2008లో హెటిరో డ్రగ్స్ కంపెనీ వారు గ్రామసభలు పెట్టి 1200మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి కొంతమందికి మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు అడిగేవారు లేరు. అల్లూరి సీతారామరాజు తిరిగిన నేల ఇది. కళింగాంధ్రను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు దోపిడి చేస్తున్నాయి. వేల ఎకరాలు దోపిడీ చేస్తున్నారు తప్ప....ఒక్క ఉద్యోగం ఇవ్వడం లేదు. ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి రోజుకో మాట మారుస్తున్నారు. రాష్ట్రంలో యువతను ఓట్లు వేయించుకొనేందుకే చూస్తున్నారు. ఈ పాలకులకి వారి విద్య - ఉపాధిపై స్పష్టమైన విధానం ఉందా. వారికి సరైన విద్య అందించాలని మాత్రం చూడటం లేదు`` అంటూ ప‌వ‌న్ మండిప‌డ్డారు.

ముఖ్యమంత్రి గారికి అమరావతి అభివృద్ధి తప్ప పాయకరావు పేట అభివృద్ధి అవసరం లేదని ప‌వ‌న్ ఎద్దేవా చేశారు. `అమరావతిలో యూనివర్శిటీలకు వందలాది ఎకరాలు ధారదత్తం చేస్తారు.. ఇక్కడ కాలేజీలు - ఆసుపత్రులని మాత్రం పట్టించుకోరు. ఉత్తరాంధ్రలో స్వచ్ఛ భారత్ లో కూడా అవినీతి రాజ్యం ఏలుతోంది. హెటిరో కంపెనీ వారు వ్యర్థ పదార్థాలను సముద్రంలోకి వదలడం వల్ల పలు గ్రామాల్లో మత్యకారులకు నష్టం కలుగుతోంది. ఆర్థికంగా వెనకబడిన వారికి ఎప్పుడూ జనసేన అండగా ఉంటుంది” అన్నారు. అమరావతిలో యూనివర్సిటీలకు దారాదత్తం చేశారని, కానీ పాయకరావుపేటలో ఒక్క డిగ్రీ కళాశాల ఇచ్చేందుకు ఆ గంటా శ్రీనివాస రావు, మిగతా టీడీపీ నేతలు వెనుకాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అంటారు కానీ పాయకరావుపేటలో ఆసుపత్రిని అరవై పడకలకు మార్చకపోవడం మీ చేతగానితనం అన్నారు.