Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ స‌త్తా ఇప్పుడు తేలుతుంది

By:  Tupaki Desk   |   28 Oct 2015 3:13 PM GMT
ప‌వ‌న్ స‌త్తా ఇప్పుడు తేలుతుంది
X
ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్... ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ - తెలంగాణ అనే కాకుండా తెలుగువారిలో విప‌రీత‌మైన క్రేజ్ ఉన్న పాపుల‌ర్ హీరో. ప్ర‌జ‌ల ప‌క్షాన ప్ర‌శ్నించేందుకు అంటూ గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌న‌సేన పేరుతో ప‌వ‌న్ సొంత పార్టీని స్థాపించారు. ఆ ఎన్నిక‌ల్లో త‌న అన్న‌య్య చిరుకు వ్య‌తిరేకంగా బీజేపీ-టీడీపీల‌కు మ‌ద్ద‌తుగా ప్రచారం చేశారు. ఆ రెండు పార్టీలు విజ‌య‌తీరాల‌కు చేర‌డంలో ప‌వ‌న్ క్రియాశీల పాత్ర పోషించారు. ఆ ఎన్నిక‌ల త‌ర్వాత పవ‌న్ పెద్ద‌గా రాజ‌కీయ కార్య‌కలాపాల్లో పాల్గొన‌లేదు కానీ అడ‌పాద‌డ‌పా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తున్నారు.

తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీకి తెలంగాణ రాష్ర్ట ఎన్నిక‌ల సంఘం రాజ‌కీయ‌పార్టీగా గుర్తింపునిచ్చింది. ఈ మేర‌కు ప్ర‌త్యేక గుర్తులేని పార్టీగా జ‌న‌సేన‌ను న‌మోదు చేసుకున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీచేసింది. ఇప్ప‌టివ‌ర‌కు పార్టీగా అధికారిక గుర్తింపు లేన‌ప్ప‌టికీ ప‌వ‌న్ ప‌రోక్షంగా రాజ‌కీయాల్లో త‌న స‌త్తా చాటారు. ఇపుడు రాజ‌కీయ‌పార్టీగా గుర్తింపు వ‌చ్చిన నేప‌థ్యంలో, ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడిగా ఉన్నందున ప‌వ‌న్ ప్ర‌తి కామెంటూ, చ‌ర్య ఆస‌క్తిక‌ర‌మే అవుతుంది.

తెలంగాణ రాష్ర్టంలో ఎన్నిక‌ల సంఘం గుర్తింపు ఇవ్వ‌డం...అది ప్ర‌స్తుత హాట్ హాట్ రాజ‌కీయాల స‌మ‌యంలో కావ‌డం కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపింది. ఇప్ప‌టికే వ‌రంగ‌ల్ పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ జారీ అయి నామినేష‌న్ల ప్ర‌క్రియ షురూ అయింది. ఈ ఎన్నిక‌ల్లో ఎన్డీఏ త‌ర‌ఫు అభ్య‌ర్థి బ‌రిలో ఉంటార‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు, టీటీడీపీ నేత‌లు ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లో నారాయ‌ణ్‌ ఖేడ్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక ప్ర‌క‌ట‌న కూడా రాబోతోంది. వీట‌న్నింటికీ మించి గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు అధికార టీఆర్ ఎస్ పార్టీ వేగంగా సిద్ధ‌మ‌వుతోంది. వీట‌న్నింటికీ తోడు... స‌న‌త్‌ న‌గ‌ర్‌ - మ‌హేశ్వ‌రం - చేవెళ్ల‌ - ముథోల్ శాస‌న‌స‌భ్యులు పార్టీ ఫిరాయించినందున‌ వారిపై వేటు వేయాలంటూ కాంగ్రెస్ - టీడీపీలు స్పీక‌ర్ నుంచి మొద‌లుకొని రాష్ర్ట‌ప‌తి వ‌ర‌కు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. ఈ ప‌రంప‌ర‌లో త్వ‌ర‌లోనే తుది నిర్ణ‌యం వెలువ‌డే అవ‌కాశాలు ఉన్నాయి.

మొత్తంగా రాబోయే వ‌రుస ఎన్నిక‌ల వాతావ‌ర‌ణంలో గ‌తంలో ప్ర‌క‌టించిన‌ట్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒంట‌రిగా పోటీచేస్తారా? 2014 ఎన్నిక‌ల వ‌లే టీడీపీ-బీజేపీల‌కు మ‌ద్ద‌తిస్తారా? లేదంటే ప్ర‌స్తుతం ఉన్న‌ట్లు సినిమాల‌కు ఎక్కువ ప్రాధాన్యం, రాజ‌కీయాల‌కు త‌క్కువ ప్రాధాన్యం ఇస్తారా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.