Begin typing your search above and press return to search.

జనసేనకు సున్నా..పవన్‌ ను మళ్లీ పట్టించుకోలేదప్పా!

By:  Tupaki Desk   |   30 Jan 2019 5:18 PM GMT
జనసేనకు సున్నా..పవన్‌ ను మళ్లీ పట్టించుకోలేదప్పా!
X
లోక్‌ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు జాతీయ మీడియా సంస్థలు సర్వేలు ముమ్మరం చేశాయి. కొన్ని జాతీయ ఛానళ్లు ఇప్పటికే సర్వేలు పూర్తి చేశాయి. తాజాగా టైమ్స్ నౌ ఛానల్ కూడా సర్వే ఫలితాలను ప్రకటించింది. ఏపీలో వైఎస్సార్ సీపీకి తిరుగులేదని తేల్చేసింది. ఏపీలో ఉన్న 25 లోక్‌ సభ స్థానాలకు గానూ 23 స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది. టీడీపీకీ కేవలం 2 స్థానాలు మాత్రమే దక్కుతాయని సర్వే స్పష్టం చేసింది.

అయితే.. ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే.. ఏపీలో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్న జనసేన పార్టీ గురించి సర్వేలో ప్రస్తావించకపోవడం కొసమెరుపు. కనీసం పోటీ ఇస్తుందని గానీ - పోటీలో ఉంటుందని గానీ సర్వే చెప్పని పరిస్థితి. అసలు జనసేన అనే పార్టీ ఏపీలో ఉందన్న సంగతిని టైమ్స్ నౌ గుర్తించలేదా లేక గుర్తించినప్పటికీ ఆ పార్టీకి ఎంపీ స్థానం గెలుచుకునేంత సత్తా లేదని పరోక్షంగా తేల్చేసిందా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి.

అయితే.. జాతీయ ఛానల్స్ సర్వే ఫలితాలు వెల్లడైన ప్రతీ సందర్భంలోనూ జనసేన పార్టీ కనీస గుర్తింపుకు నోచుకోని పరిస్థితి. కొన్ని రోజుల క్రితం రిపబ్లిక్ టీవీ వెల్లడించిన సర్వే ఫలితాల్లోనూ జనసేన పార్టీ ఊసే లేకపోవడం గమనార్హం. ఈ సర్వే ఫలితాలు వెల్లడైన ప్రతీ సందర్భంలోనూ జనసేన శ్రేణులు నిరాశకు లోనవుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఇతర రాష్ట్రాల సంగతి పక్కనపెడితే.. లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తే అదే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటిన సందర్భాలున్నాయి. దీంతో ఈ సర్వేల ప్రభావం ప్రజలపై పడితే జనసేనను లైట్ తీసుకునే పరిస్థితులూ లేకపోలేదు. ఇప్పటికే ప్రజారాజ్యం పార్టీ పతనంతో మూటగట్టుకున్న అప్రతిష్ట ప్రభావం పవన్‌ పార్టీ విషయంలో కూడా ఎంతో కొంత పడే అవకాశం ఉంది. అన్న బాటలోనే తమ్ముడు పయనించక తప్పదని కొందరు, చిరంజీవికి వచ్చినన్ని అసెంబ్లీ స్థానాలు కూడా పవన్‌కు రావని తేల్చి చెబుతున్న వారూ ఉన్నారు.

జనసేన పార్టీలో నెలకొన్న కొన్ని పరిస్థితులు కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానం సాధించే సత్తా కూడా ఆ పార్టీకి లేదన్న విమర్శలకు కారణమవుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే ఇంతవరకూ ఇంఛార్జ్‌లను నియమించని పరిస్థితిలో ఆ పార్టీ ఉండటం, పార్లమెంట్ స్థానాలకు ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు రాకపోవడం ఇలా అనేక పరిణామాలు జనసేనను కలవరపెడుతున్నాయి. ఏదేమైనా జాతీయ ఛానల్స్ విడుదల చేస్తున్న సర్వే ఫలితాల్లో జనసేనను విస్మరిస్తుండటం ఆ పార్టీ నేతల్లో అభద్రతా భావాన్ని మరింత పెంచుతోంది.