Begin typing your search above and press return to search.

విశాఖ‌పై జ‌న‌సేన‌కు ప‌ట్టు పెరిగిందా? 31% ఓటింగ్ ఖాయ‌మా?

By:  Tupaki Desk   |   10 Oct 2022 2:30 AM GMT
విశాఖ‌పై జ‌న‌సేన‌కు ప‌ట్టు పెరిగిందా? 31% ఓటింగ్ ఖాయ‌మా?
X
ప్రాంతాల వారీగా.. జ‌న‌సేన ప‌ట్టు బిగించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా.. ఒక‌టి రెండు రోజుల్లో జిల్లాల వారీగా పార్టీ స‌మాలోచ‌న‌లు జ‌రిపే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌ధానంగా.. విశాఖ జిల్లాపై పెద్ద ఎత్తున ఫోక‌స్ పెంచే ఆలోచ‌నలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. కీల‌క నేత‌ల‌ను పార్టీలోకి చేర్చుకోవ‌డం ద్వారా.. ఓటు బ్యాంకును పెంచుకునే వ్యూహాన్ని కూడా అనుస‌రించాల‌ని.. పార్టీ భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఇప్ప‌టికే మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు.. జ‌న‌సేన‌వైపు మొగ్గు చూపుతున్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న‌ను పార్టీలోకి చేర్చుకుంటే.. విశాఖ‌పై మ‌రింత ప‌ట్టు పెంచుకునేందుకు జ‌న‌సేన‌కు అవ‌కాశం ఉంటుంద‌ని..నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఇక్క‌డ బాగానే ఫోక‌స్ పెంచింది. గాజువాక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేశారు. అయితే.. ఆయ‌న ప‌రాజ‌యం పొందినా.. 70 వేల పైచిలుకు ఓట్లు సాధించారు.

ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. ఇదే ఊపు క‌నిపించింది. అయితే.. అది ఒంట‌రిపోరు కావ‌డంతో పార్టీకి కొంత న‌ష్టం వ‌చ్చింద‌నే అంచ‌నాలు వున్నాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే.. జ‌న‌సేన‌కు మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు. అయితే.. పొత్తు ఉన్నా.. లేకున్నా.. గ‌త ఎన్నిక‌ల్లో 27 శాతం ఓటింగ్ వ‌చ్చిన ద‌రిమిలా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో దీనిని మ‌రింత పెంచాల‌ని వ్యూహంతో ఉన్నార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఉన్న లెక్క‌ల ప్ర‌కారం.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. జ‌న‌సేన‌కు విశ‌ఖ‌లో 31 శాతం ఓటింగ్ ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

అయితే..వ‌చ్చే ఎన్నిక‌ల్లో దీనిని 50 శాతం దాటించ‌గ‌లిగితే.. క‌నీసం.. 8 నుంచి 10 నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం ద‌క్కించు కోవ‌చ్చ‌న్న‌ది జ‌న‌సేన వ్యూహంగా ఉంది. త్వ‌ర‌లోనే ప‌వ‌న్ దీనిపై ఒక ప‌క్కా వ్యూహాన్ని అమ‌లు చేయ‌నున్నార‌ని. పార్టీనాయ‌కులు చెబుతున్నారు. కీల‌క నేత‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంతోపాటు.. విశాఖ‌లో వైసీపీ అరాచ‌కాల‌ను టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతార‌నే వాద‌న వినిపిస్తోంది. ఏదేమైనా.. విశాఖ‌ను జ‌న‌సేన ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తుండ‌డం గ‌మ‌నార్హం.