Begin typing your search above and press return to search.

జనసేనాని ఒంటరిపోరు.. వాళ్ల ఆశలు గల్లంతు

By:  Tupaki Desk   |   4 March 2019 9:47 AM GMT
జనసేనాని ఒంటరిపోరు.. వాళ్ల ఆశలు గల్లంతు
X
తెలంగాణలో చాలా పార్టీలున్నాయి. కానీ ఏపీలో రెండేరెండు.. గడిచిన 2014 ఎన్నికల వేళ.. ఏపీ ప్రజలు టీడీపీ-వైసీపీకి మాత్రమే ఓట్లేశారు. బీజేపీ మిత్రపక్షంగా టీడీపీతో కలిసి పోటీచేసి నాలుగు సీట్లు సంపాదించుకుంది. సొంతంగా గెలువలేని నేతలంతా అప్పుడు బీజేపీ-టీడీపీ పొత్తు ఖాయమని అంచనావేసి బీజేపీలో చేరి ఎమ్మెల్యేలయ్యారు. అయితే ఆ ఓట్లు టీడీపీ ఓట్లుగా పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే బీజేపీకి అస్సలు ఏపీలో ఉనికే లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. అందుకే టీడీపీ చాటున బీజేపీ నుంచి కొందరు లక్కీగా గెలిచేశారు.

జనసేనాని పవన్ కూడా 2014 ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం చాలక బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతిచ్చి ఆంధ్రప్రదేశ్ పీఠం తెలుగుదేశానికి దక్కేలా కృషి చేశారు. కానీ ఇప్పుడు పవన్ అదే పరిస్థితిలో ఉన్నారు. మద్దతివ్వడం తప్పితే సొంతంగా పోటీ చేసేంత నాయకులు లేరు.. కార్యకర్తల బలం జనసేనకు లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో జనసేనాని ఈ ఎన్నికల్లో పోటీచేస్తారా.? పోయిన సారిలాగానే మద్దతు మంత్రం జపిస్తారా అన్న ఆసక్తి జనసైనికుల్లోనూ ఉత్కంఠ రేపుతోంది.

అయితే జనసేనాని పవన్ ఖచ్చితంగా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటాడని నమ్మి.. టీడీపీ - వైసీపీలో టికెట్లు దక్కని చాలా మంది చోటామోటా నేతలు జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ ఈ 2019 ఎన్నికల వేళ.. అయితే టీడీపీతో లేదంటే వైసీపీతో పొత్తు పెట్టుకుంటాడని ఆశించారు. మొదట పవన్ వైసీపీ తో వెళతారని ప్రచారం జరిగింది. కానీ అక్కడ చెడడంతో ఇటీవల చంద్రబాబు సైతం జనసేనతో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి అని ఆహ్వానించారు. కానీ పవన్ బాబు ప్రతిపాదనను కాలదన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిపోరుకే పవన్ మొగ్గు చూపుతున్నారు. దీంతో టీడీపీ లేదా వైసీపీ పొత్తు బలంతో ఎమ్మెల్యేలు అవుదామని కలలుగన్న జనసేన నేతల ఆశలు ఆవిరయ్యాయి.

కానీ ఇప్పుడు పవన్ ఒంటరి పోరు ప్రకటన చూసి వారంతా బావురుమంటున్నారని జనసేనలో కిందిస్థాయి నేతలు కథలు కథలు చెబుతున్నారు. వారంతా జనసేనలో ఉండలేక.. వేరే పార్టీల్లో టికెట్ ఖాయం కాక పక్క పార్టీల వైపు చూస్తున్నారు. జనసేనానిని నమ్మి నిండా మునిగిపోయామని నెత్తిమీద గుడ్డ వేసుకొని వలస వచ్చిన నేతలంతా మథన పడుతున్నారట.. నాడు బీజేపీకి వర్కవుట్ అయిన ప్లాన్ ఇప్పుడు జనసేనలో చేరిన వారికి కాకపోవడంతో వారంతా హతాషులయ్యారు.

...ఎస్ ఆర్ కే