Begin typing your search above and press return to search.

తీవ్ర అస్వస్థతో జనసేన అభ్యర్థి వైఎస్పీ రెడ్డి

By:  Tupaki Desk   |   8 April 2019 8:50 AM GMT
తీవ్ర అస్వస్థతో జనసేన అభ్యర్థి వైఎస్పీ రెడ్డి
X
మండే ఎండల్లో ఎన్నికల ప్రచారమంటే మాటలు కాదు. ఈ మధ్యన వరుస ఎన్నికల ప్రచారం నేపథ్యంలో వడదెబ్బ తగిలిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసుపత్రి పాలు కావటం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నప్పటికి.. మరోవైపు వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని ఒక కంట కనిపెడుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఎండల తీవ్రత ఎక్కువ కారణంగా పలువురు అభ్యర్థులు ప్రచారాల సందర్భంగా తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారు.

ఇదిలా ఉంటే.. కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ స్థానానికి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎంపీ ఎస్పీవై రెడ్డి తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. ఐదు రోజుల క్రితం వడదెబ్బ తగిలిన నేపథ్యంలో హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిలకడగా ుందని చెబుతున్నారు.

2014 ఎన్నికల్లో నంద్యాల ఎంపీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన ఆయన.. తర్వాతి కాలంలో టీడీపీలో చేరారు. తాజాగా ఆయనకు టీడీపీ టికెట్ రాకపోవటంతో.. ఆయన జనసేన పార్టీలో చేరారు. నంద్యాల ఎంపీ టికెట్ ను పవన్ కల్యాణ్ ఇచ్చారు. దీంతో జనసేన ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎస్పీవై రెడ్డి తాజాగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ వడదెబ్బకు గురయ్యారు.

ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగుస్తున్న వేళ.. అభ్యర్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేళ.. కార్యకర్తలు.. నేతలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని వారు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఎస్పీవై రెడ్డి ఆరోగ్యం విషమంగా ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని.. వారి కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా.. అభ్యర్థి సీన్లో లేని వేళ.. జరుగుతున్న ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందన్నది ఉత్కంఠగా మారిన పరిస్థితి.