Begin typing your search above and press return to search.

నానిపై సవాళ్లతో ఉతికి ఆరేస్తున్న జనసేన కార్యకర్తలు

By:  Tupaki Desk   |   9 July 2015 4:21 AM GMT
నానిపై సవాళ్లతో ఉతికి ఆరేస్తున్న జనసేన కార్యకర్తలు
X
కొన్ని విషయాల విషయంలో ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. ఏపీ ఎంపీలు మీకు ఆత్మాభిమానం లేదా? పౌరుషం ఏమైందంటూ జనసేన అదినేత పవన్‌కల్యాణ్‌ భారీ వ్యాఖ్యలు చేసిన తర్వాత.. అక్కడెక్కడో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి.. అభివృద్ధి విషయంలో తప్ప.. మరే ఇతర వ్యాఖ్యలు చేయొద్దని.. పవన్‌పై విమర్శలకు పాల్పడవద్దని సూచించారు.

తనను వ్యక్తిగతంగా విమర్శించిన తర్వాత చంద్రబాబు చెబితే మాత్రం వింటానా అంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని తన కడుపులో ఉన్న కోపాన్నంతా తీర్చుకోవటం తెలిసిందే. తిట్టటం తేలికే. కానీ.. వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయన్న విషయం నానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నట్లుంది. ఎందుకంటే.. పవన్‌పై విమర్శల తర్వాత.. పవన్‌ సింఫుల్‌గా మూడు ట్వీట్స్‌తో కౌంటర్‌ ఇచ్చేవరకు చప్పుడు చేయని.. ఒకసారి పవన్‌ నుంచి ట్వీట్స్‌ వచ్చిన తర్వాత నుంచి.. నాని.. సుజనాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం మొదలైంది.

నా మీద తిట్టే విషయంలో చూపించే పౌరుషం కేంద్రాన్ని నిలదీసేటప్పుడు ఉంటే బాగుండాలని.. ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించాలే కానీ.. తనను తిడితే ఏం లాభం అంటూ ట్వీట్స్‌ చేయటంతో పాటు.. వ్యాపారం చేయటం తప్పు కాదని.. కానీ.. వ్యాపారం మాత్రమే చేయటం తప్పు అంటూ సూటిగా కౌంటర్‌ ఇచ్చిన పవన్‌ ట్వీట్స్‌తర్వాత జనసేన కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చారు.

దమ్ముంటే కేశినేని నాని తన పదవికి రాజీనామా చేసి.. ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థిపై పోటీ చేసి గెలవగలరా? అంటూ సవాలు విసిరారు. అంతేకాదు.. పవన్‌ను విమర్శిస్తున్న నేతలు ధైర్యం ఉంటే తమ పదవులకు రాజీనామా చేసి పోటీ చేయాలంటూ సవాలు విసిరారు. ఇక.. దిష్టిబమ్మల దగ్థం లాంటివి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చూసినప్పుడు.. నానిని విమర్శలతో జనసేన కార్యకర్తలు ఉతికి ఆరేస్తున్నట్లుగా కనిపించక మానదు.