మాటలతో ఎదుటివారి నోరు మూయించడంలో సిద్ధ హస్తుడైన తెలంగాణ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో అడ్డంగా బుక్కయిపోయారు. కాంగ్రెస్ పై పంచ్ వేయబోయి ఆ పార్టీ నేత జానారెడ్డి వేసిన రివర్స్ పంచ్ తో ఇరుకునపడ్డారు. తాను బోల్తాపడడమే కాకుండా సీఎం కేసీఆర్ కూడా ఇరుకునపడేలా అవకాశమిచ్చారు.
ఇంతకీ ఏమైందంటే.. తెలంగాణ అసెంబ్లీలో రైతుల సమస్యలపై చర్చ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ సభ్యుల హాజరు తక్కువగా ఉంది. ఆ సమయంలో సభలో మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు... కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టాలని ట్రై చేశారు. సభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూర్చున్న వైపు చూస్తే వారికి రైతులపై ఎంత ప్రేమ ఉందో అర్థమైపోతుందని అన్నారు. రైతుల సమస్యల గురించి మాట్లాడడానికి జీవన్ రెడ్డి సభలో లేకుండా పోయారని - కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ కనపడడం లేదని అన్నారు. రైతులపై వారికున్న ప్రేమ - శ్రద్ధ ఏ పాటిదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.
హరీశ్ నోటి నుంచి ఆ మాటలు వచ్చాయో లేదో వెంటనే కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి వెంటనే కౌంటరేశారు. తమ సంగతి సరే సీఎం కేసీఆర్ అసలున్నారా అని ప్రశ్నించారు. సభలో ప్రతి సభ్యుడు చెప్పిన విషయాన్ని తాము శ్రద్ధగా వింటున్నామని.. సభలో అంతటి ముఖ్యమైన విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు సీఎం కేసీఆర్ మాత్రం లేరని.. దాన్ని బట్టి ఆయనకు రైతులపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. దీంతో హరీశ్ సమాధానం చెప్పలేక తెగ ఇబ్బంది పడ్డారు.