అధికారం మాహా చెడ్డది. ఒకసారి పవర్ ను బాధ్యతగా కాకుండా హోదాగా ఫీలయ్యే వాళ్లతో పెద్ద చిక్కే అని చెప్పాలి. ఎందుకంటే వారు.. పవర్ చేతిలో ఉన్నప్పుడు పని చేసే కన్నా.. దాన్ని ఎంజాయ్ చేసే పనిలో పడిపోతారు. ఒక్కసారి అలా అలవాటు అయ్యాక పోరాడే తత్వం నశిస్తుంది. పవర్ పోయాక అలవాటైన సుఖాన్ని ఎంజాయ్ చేయలేని బాధే తప్పించి.. కష్టపడి తిరిగి పవర్ ను చేజిక్కించుకోవాలన్న ఆలోచన కాస్త తక్కువగా ఉంటుంది. ఇక.. తమ రాజకీయ ప్రత్యర్థి కానీ పవర్ ఫుల్ అయితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది.
ఇలాంటి పరిస్థితే ఇప్పుడు ఎదుర్కొంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. పదేళ్లు నాన్ స్టాప్ అధికారం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పవర్ పక్కా అని ఫీలైన వారు.. చివరకు లెక్క తేడా రావటం.. విపక్షంగా రూపాంతరం చెందటం తెలిసిందే.ఇక.. కేసీఆర్ లాంటి నేత రాష్ట్రానికి రావటం.. ఆయన వ్యూహ చాతుర్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. తమకున్న సహజ బలాల్ని కూడా మర్చిపోయారని చెప్పాలి.
ఎన్నికలు ముగిసి దాదాపు రెండేళ్లు అవుతున్నా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే రెగ్యులర్ తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని వేళ్ల మీద లెక్కేయొచ్చు. ఎందుకిలా అంటే.. పోరాటతత్వం తగ్గిపోవటమే. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పోరాటం అంటే కష్టమని.. అందుకే.. ఎన్నికలకు ఏడాది ముందు నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందన్న ఆలోచనలు తెలంగాణ కాంగ్రెస్ ను రోజురోజుకీ బలహీనం చేస్తుంటే.. ఈ వైఖరి తెలంగాణ అధికారపక్షాన్ని మరింత బలోపేతం చేస్తుది.
దీనికి తోడు వస్తున్న ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ కు మింగుడుపడని రీతిలో ఉంటున్నాయి. తాము ఎంత ప్రయత్నించినా తమకు అనుకూలంగా ఫలితం రావటం లేదన్న బాధ వారి మాటల్లో వినిపిస్తోంది. అయితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును పెంచటంలో తాము విఫలం చెందటమే ఎన్నికల్ని తమకు అనుకూలంగా మార్చుకోలేకపోతున్నామన్న విషయాన్ని వారు మరిచిపోతున్నారు. తాజాగా పాలేరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఒక ఎత్తు అయితే.. 45వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోవటానికి మించిన విషాదం మరొకటి ఉండదు. పాలేరు ఓటమిపై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ.. పాలేరు తీర్పును గౌరవిస్తున్నామని.. టీఆర్ఎస్ సర్కారు ఏదో చేస్తుందన్న భ్రమలో ఉండి ఓటేసినట్లుగా చెప్పుకొచ్చారు.
అంతేకానీ.. ప్రజలు భ్రమల్లో ఉన్నారనుకునే కన్నా.. అలా ఉండటానికితాము విఫలం చెందటమేనన్న భావన జానారెడ్డి లాంటి సీనియర్ నేతలకు లేకపోవటం గమనార్హం. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. పాలేరు ఓటమిపై పార్టీ కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని విశ్లేషించుకుంటామని చెప్పుకొచ్చారు. ఫీడ్ బ్యాక్ తీసుకోవాల్సింది కాంగ్రెస్ నాయకత్వం మీదన్న విషయాన్నిజానారెడ్డి ఎప్పటికి గుర్తిస్తారో..?