Begin typing your search above and press return to search.

గతాన్ని మర్చిపోయారా జానాసాబ్..?

By:  Tupaki Desk   |   13 Dec 2015 2:07 PM IST
గతాన్ని మర్చిపోయారా జానాసాబ్..?
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత జానారెడ్డికి కోపం వచ్చింది. అది కూడా అలాంటి ఇలాంటి కోపం కాదు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఇందుకోసమేనా? అన్న వరకూ ఆయన అగ్రహం వెళ్లింది. హుందాగా వ్యవహరించాలంటూ.. ఆచితూచి మాట్లాడే ఆయన.. అవసరమైన తన వర్గ నేతల్ని అసెంబ్లీలో చిన్నబుచ్చి.. అధికారాపార్టీకి దన్నుగా నిలిచే ఆయన ఇప్పుడు మండిపడుతున్నారు. ఇలాంటి పనులు చేసేందుకేనా.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మండలి ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో మాట్లాడిన జానారెడ్డి కేసీఆర్ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నష్టపోందని తెలిసి కూడా ప్రజల ఆకాంక్షల్ని అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్రం ప్రకటించిందన్న ఆయన.. తెలంగాణకు ఏదో అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో టీఆర్ ఎస్ కు అధికారాన్ని కట్టబెట్టారని చెప్పారు. అయితే.. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా అభివృద్ధి మీద దృష్టి పెట్టని అధికారపక్షం.. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు అన్నవి నామరూపాల్లేకుండా చేస్తుందని మండిపడ్డారు.

అసలు ఇందుకేనా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది? ఇదేనా తెలంగాణ ప్రజలు ఆశించింది? ఇదేనా తెలంగాణ ప్రజలు కోరుకున్నది? అన్నీ వర్గాలు ఏకమై తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తే.. ఇలా చేస్తారా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. కాలం కలిసి వచ్చినప్పుడు ఇలానే చెలరేగిపోతారని.. 2004.. 2009లలో అధికారంలోకి వచ్చిన సందర్భంగా నాటి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైఎస్ చేసిన పనులను మర్చిపోయారా? అని టీఆర్ ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇలాంటివే చేసినప్పుడు నోరు విప్పని జానా.. ఇప్పుడు మాత్రం ఇంతలా ఆవేశపడాల్సిన అవసరం ఉందా? అని పంచ్ లేస్తున్నారు తెలంగాణ అధికారపక్ష నేతలు. తప్పు చేస్తే ఏదో ఒక రోజు ఫలితం అనుభవించాలంటారు. దానికి ఇదే అర్థమేమో.