Begin typing your search above and press return to search.

ఆరే.. జానా కూడా నిప్పులు చెరుగుతున్నారే..?

By:  Tupaki Desk   |   6 Aug 2015 5:11 AM GMT
ఆరే.. జానా కూడా నిప్పులు చెరుగుతున్నారే..?
X
హుందా రాజకీయాలు పేరు చెప్పుకొని.. తెలంగాణ అధికారపక్షం పట్ల మెతక వైఖరిని అనుసరించే తెలంగాణ కాంగ్రెస్ విపక్ష నేత జానారెడ్డికి ఉన్నట్లుండి అగ్రహం వచ్చేసింది. పాతికమంది పార్టీకి చెందిన నేతల్ని లోక్ సభలో సస్పెన్షన్ వేటు వేస్తే.. భూమి.. ఆకాశం ఏకమయ్యేలా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ విరుచుకుపడుతున్న వైనంతో.. ఆయన స్ఫూర్తి పొందారో ఏమో కానీ.. తాజాగా ఆయన తెలంగాణ సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

తెలంగాణ ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపే విషయంలో జానా పూర్తి స్థాయిలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపించినా.. ఇప్పటి రాజకీయాలకు తాను సూట్ కానంటూ.. తనదైన మార్గంలోనే నడుస్తానని చెప్పిన జానా.. తాజాగా వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఉద్యమ నేతగా ఎదిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాలనా సామర్థ్యం లేదని ఆరోపించిన జానా.. కేసీఆర్ కారణంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పదేళ్లు వెనక్కి వెళ్లిపోయిందని వ్యాఖ్యానించారు. పనికి రాని మాటలతో కాలయాపన చేస్తూ.. పాలనను అపహాస్యం చేసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డ జానాకు.. ఉన్నట్లుండి అంతగా అగ్రహం ఎందుకు వచ్చిందో..? త్వరలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సమయంలో.. జానా తీవ్రస్థాయిలో విరుచుకుపడటం చూస్తుంటే.. సమావేశాలు ఈసారి మరింత హాట్.. హాట్ గా సాగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.