Begin typing your search above and press return to search.

మొదటి ప్రెస్ మీట్ లోనే ప్రత్యర్థులకు ఛాన్సు ఇచ్చిన జమున

By:  Tupaki Desk   |   30 May 2021 9:30 AM GMT
మొదటి ప్రెస్ మీట్ లోనే ప్రత్యర్థులకు ఛాన్సు ఇచ్చిన జమున
X
భూకబ్జా ఆరోపణల్ని ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి చెందిన అధికార పత్రికలో పెద్ద ఎత్తున కథనాలు రావటం.. వాటిని ఖండించటం తెలిసిందే. త్వరలో పార్టీ నుంచి బయటకు వచ్చేయటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. అనూహ్యంగా తన భార్య జమునను మీడియా ముందకు తీసుకొచ్చి మాట్లాడించటం హాట్ టాపిక్ గా మారింది.

ఒక రోజు ముందుగానే మీడియా మిత్రులకు.. జమున ప్రెస్ మీట్ గురించి సమాచారం అందింది. అంటే..అన్నీ పక్కాగా అనుకున్న తర్వాతే ప్రెస్ మీట్ జరిగిందని చెప్పాలి. ఇలాంటివేళ.. ఆమె ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఏయే అంశాల్ని ప్రస్తావించాలి? ఏ అంశాల్ని టచ్ చేయకుండా ఉండాలన్న దానిపై ఆమెకు స్పష్టత ఉండి ఉండాలి. మరేం జరిగిందో కానీ.. టచ్ చేయకూడని అంశాల్ని ఆమె ప్రస్తావించటం ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కులం ప్రస్తావన తెచ్చి ఆమె తప్పు చేశారంటున్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో కులాలు చూడలేదన్న ఆమె.. ఇప్పుడు కులాలతో విభజన చేస్తున్నారని.. తమకు అన్నికులాలు సమానమేనని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మాటపైనే పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ.. జమునమ్మ చెప్పినట్లుగా ఆమెకు అన్ని కులాలు సమానమే అయినప్పుడు.. తన కొడుకు పేరు చివర ‘‘రెడ్డి’’ పేరు ఎందుకు పెట్టుకున్నట్లు? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. ఈటల రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. జమున రెడ్డి వర్గానికి చెందిన వారు.

తమ కొడుక్కి తన సామాజిక వర్గాన్ని తెలిపేలా పేరు పక్కన పెట్టుకొని.. ఈ రోజున తమకు కులాలన్ని ఒక్కటేనని వ్యాఖ్యానించటం సరికాదంటున్నారు. నిజంగా అంత అభిమానమే ఉంటే.. భర్త కులాన్ని కాదని.. తన సామాజిక వర్గం తెలిసేలా కొడుకు పేరు పక్కన ‘రెడ్డి’ పదాన్ని ఎందుకు చేర్చినట్లు? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. తమ భూముల గురించి మాట్లాడేస్తే సరిపోయేదని.. అనవసరంగా కుల ప్రస్తావన తెచ్చి రాజకీయ ప్రత్యర్థులకు అవకాశాన్ని కల్పించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.