Begin typing your search above and press return to search.

జైహింద్ అన్న మాజీ సీఎంకు చేదు అనుభ‌వం!

By:  Tupaki Desk   |   23 Aug 2018 6:16 AM GMT
జైహింద్ అన్న మాజీ సీఎంకు చేదు అనుభ‌వం!
X
భార‌త మాతాకీ జై.. జైహింద్ లాంటి నిషేధ ప‌దాలేమీ కాదు. కానీ.. ఆ రెండు మాట‌ల్ని అన్న ఒక మాజీ ముఖ్య‌మంత్రికి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఇంత‌కీ ఈ రెండు మాటల‌తో ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొన్న మాజీ సీఎం ఎవ‌రో కాదు.. జ‌మ్ముక‌శ్మీర్ కు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నేత ఫ‌రూక్ అబ్దుల్లా.

నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ పార్టీ అధినేత ఫ‌రూక్ కు తాజాగా చేదు అనుభ‌వం ఎదురైంది. బ‌క్రీద్ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని.. శ్రీ‌న‌గ‌ర్ లోని ప్రార్థ‌నామందిరానికి ఆయ‌న వెళ్లారు.ఈ సంద‌ర్భంగా అక్క‌డకు చేరిన యువ‌త నుంచి నిర‌స‌న ఎదురైంది. ప్రార్థ‌న చేసే స‌మ‌యంలో అక్క‌డి యువ‌త నుంచి ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా నినాదాలు ఎదుర‌య్యాయి.

ఎందుకిలాంటి ప‌రిస్థితి ఎదురైందంటే.. ఇటీవ‌ల మ‌ర‌ణించిన మాజీ ప్ర‌ధాని వాజ్ పేయికి నివాళులు అర్పించే కార్య‌క్ర‌మం ఈ మ‌ధ్య‌న నిర్వ‌హించారు. ఇందులో పాల్గొన్న ఫ‌రూక్.. చివ‌ర్లో భార‌త్ మాతాకీ జై.. జైహింద్ అంటూ నినాదాలు చేశారు. దీనిపై క‌శ్మీర్ కు చెందిన కొంద‌రు యువ‌కులు తీవ్ర నిర‌స‌నను వ్య‌క్తం చేస్తున్నారు. ఫ‌రూక్ ప్రార్థ‌న‌లు చేసే స‌మ‌యంలో.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తే.. మ‌రికొంద‌రు చేతిలో చెప్పులు ఉండ‌టం గ‌మ‌నార్హం.

ప‌రిస్థితి ఉద్రిక్తంగా మార‌టంతో.. ఆయ‌న భ‌ద్ర‌తా సిబ్బంది అక్క‌డ నుంచి త్వ‌ర‌గా వెళ్లిపోవాలంటూ సూచ‌న‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఫ‌రూక్ కు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తున్న యువ‌కుల గుంపు.. ముఖానికి మాస్క్ లు క‌ట్టుకోవ‌టం గ‌మ‌నార్హం. ఫ‌రూక్ ను తీవ్ర ప‌ద‌జాలంతో దూషిస్తూ నినాదాలు చేస్తూనే.. మ‌రోవైపు ఆజాదీ (స్వాతంత్య్రం) అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.