Begin typing your search above and press return to search.

పెద‌నాన్న‌నే ఎదురిస్తూ

By:  Tupaki Desk   |   23 July 2021 7:30 AM GMT
పెద‌నాన్న‌నే ఎదురిస్తూ
X
రాజ‌కీయాల్లో ఎవ‌రెప్పుడు శ‌త్రువులుగా మారుతారో ఎవ‌రెప్పుడు మిత్రులు అవుతారో చెప్ప‌లేం అంటుంటారు. రాజ‌కీయాల కార‌ణంగా సొంత కుటుంబంలోనే చిచ్చు ఏర్ప‌డుతుంది. సొంత‌వాళ్ల‌నే నానా మాట‌లు అనేలా చేస్తోంది. వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి ద్వేషం లేన‌ప్ప‌టికీ రాజ‌కీయ ప‌రంగా చూసుకుంటే అయిన‌వాళ్ల మీదే విమ‌ర్శ‌లు చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇక ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు పార్టీలో ఉంటే ఇక విమ‌ర్శ‌లు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్పుడు త‌న పెద‌నాన్న‌పై జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే డాక్ట‌ర్ సుధీర్ రెడ్డి విమ‌ర్శ‌లు చేయ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

మాజీ రాజ్య‌స‌భ ఎంపీ రాయ‌ల‌సీమ ఉద్య‌మ నేత డాక్ట‌ర్ ఎంవీ మైసూరా రెడ్డి ఇటీవ‌ల జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల‌వివాదంపై ఆల‌స్యంగా స్పందించిన ఆయ‌న రెండు రాష్ట్రల ముఖ్య‌మంత్రులు త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే ఈ గొడ‌వ సృష్టించార‌ని ఇద్ద‌రు కూర్చుని మాట్లాడుకుంటే తీరిపోయే స‌మ‌స్య‌ను ఇప్పుడు పెద్ద‌దిగా చేసి కేంద్రం చేతుల్లో పెట్టార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కృష్ణా, గోదావ‌రి న‌దుల యాజ‌మాన్య బోర్డుల ప‌రిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేష‌న్ గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ ప్రాజెక్టులైన హంద్రీ నీవా, తెలుగు గంగ‌, వెలిగొండ‌, గాలేరు న‌గ‌రి, సోమ‌శిల‌, కండ‌లేరు ప‌థ‌కాల‌కు గొడ్డ‌లి పెట్టు అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

మైసూరారెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన‌ తాజాగా ఆయ‌న త‌మ్ముడి (వెంక‌ట‌సుబ్బారెడ్డి) కొడుకు జ‌మ్మ‌ల‌మ‌డుగు వైసీపీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ సుధీర్‌రెడ్డి తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. త‌న పెద‌నాన్న‌నే నిల‌దీశారు. టీడీపీ హ‌యాంలో న‌దీ జ‌లాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌లించుకుపోతే మైసూరారెడ్డి నిద్ర‌పోయారా? అని ప్ర‌శ్నించారు. ఏపీకి తెలంగాణ ప్ర‌భుత్వం అన్యాయం చేస్తున్న రోజుల్లో మైసూరా రెడ్డి మౌనంగా ఉన్నార‌ని ఇప్పుడు న్యాయం చేస్తున్న జ‌గ‌న్ స‌ర్కారుపై రాళ్లు వేయ‌డం దుర్మార్గ‌మ‌ని మండిప‌డ్డారు. 2014-19 మ‌ధ్య శ్రీశైలం జ‌లాశ‌యం వ‌ద్ద 800 అడుగుల్లోపే నీటిమ‌ట్టం ఉన్న‌పుడు తెలంగాణ ప్ర‌భుత్వం కృష్ణా జ‌లాల‌ను త‌ర‌లించేందుకు శ్రీకారం చుట్టింద‌ని ఆ అంశంపై చంద్ర‌బాబు పాల‌న‌లో మైసూరారెడ్డి నోరు తెర‌వ‌క‌పోవ‌డం రాయ‌ల‌సీమ‌పై ఆయ‌న‌కున్న ప్రేమ ఏ పాటిదో అనేదానికి నిద‌ర్శ‌న‌మ‌ని సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు.

టీడీపీ త‌ర‌పున 2006 నుంచి 2012 వ‌ర‌కూ రాజ్య‌స‌భ ఎంపీగా ఉన్న మైసూరారెడ్డి ఆ త‌ర్వాత వైసీపీ పార్టీలో చేరారు. కానీ రాజ్య‌స‌భ ప‌ద‌వి విష‌యంలో త‌లెత్తిన విభేధాల కార‌ణంగా ఆయ‌న పార్టీకి దూర‌మ‌య్యారు. ఇప్పుడు జ‌ల వివాదంపై జ‌గ‌న్‌ను ఇర‌కాటంలో పెట్టేలా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు త‌న త‌మ్ముడి కొడుకుతోనే జ‌గ‌న్ స‌మాధానం చెప్పించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.