Begin typing your search above and press return to search.

జమిలి ఎన్నికలు జరిగితే .. దేశం రెండుగా చీలిపోతుంది : ఎంపీ రేవంత్ రెడ్డి !

By:  Tupaki Desk   |   1 Feb 2021 1:30 PM GMT
జమిలి ఎన్నికలు జరిగితే .. దేశం రెండుగా చీలిపోతుంది : ఎంపీ రేవంత్ రెడ్డి !
X
కాంగ్రెస్ ఎంపీ , తెలంగాణ ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఒకరిని మించిన వారు ఒకరయ్యార‌ని విమ‌ర్శించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కేంద్ర బడ్జెట్ లో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం ఇప్పుడు కొత్తేమీ కాదని, ఎప్పటికప్పుడు అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టడం మోదీ, కేసీఆర్ లకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. అలాగే, దేశంలో జమిలి ఎన్నికలు జరిగితే దేశం రెండుగా విడిపోవడం ఖాయమని.. ఆ తర్వాత దేశ విభజన ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని జోస్యం చెప్పారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అధ్యక్షుడు కావడానికి దక్షిణ భారత్ ఓట్లు అవసరం లేదని, అధ్యక్షుడికి నేరుగా ఎన్నికలు జరిగితే , దక్షిణ భారత ప్రజలు సున్నాగా మారుతారన్నారు. దేశ విభజన జరిగితే దక్షిణాది దేశం అత్యంత ధనిక దేశం అవుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజల అవసరం లేకుండా అధ్యక్షుడి ఎన్నిక జరిగినప్పుడు, ఇక్కడి ప్రజలు ఎందుకు ఊరుకుంటారని ప్రశ్నించారు. మోదీ ప్రధాని అయ్యాక దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిందని, ప్రాధాన్యం కలిగిన కేంద్ర మంత్రి పదవులను ఉత్తరాది వారికే కట్టబెడుతున్నారని ఆరోపించారు.

ట్యాక్స్ అత్యధికంగా కడుతుంది దక్షిణ భారత్ రాష్ట్రాల వారేనని, కానీ నిధులు ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతున్నాయన్నారు. దక్షిణాది రాష్ట్రాల వివక్షకు కారణమయ్యే జమిలి ఎన్నికల ఆలోచనను మోదీ విరమించుకోవాలని, లేకుంటే ఈ అన్ని అంశాలను పార్లమెంట్‌ లోనే మాట్లాడతా అని అన్నారు. రైతు ఉద్యమాన్ని అణచివేసేందుకు జాతీయ రహదారులను కిలోమీటర్ల మేర తవ్వడం దుర్మార్గమన్నారు. దీనిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. రాజ్యాంగాన్ని సవరణలు చేసినప్పుడు.. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేస్తే తప్పేముందన్నారు. వ్యవసాయ చట్టాలపై ప్రధాని మోదీపై ఎవరి ఒత్తిడి ఉందన్నారు.