Begin typing your search above and press return to search.

ఒకేసారి ఎన్నిక‌లు..ఎన్నో అవ‌రోధాలు

By:  Tupaki Desk   |   25 April 2017 5:30 PM GMT
ఒకేసారి ఎన్నిక‌లు..ఎన్నో అవ‌రోధాలు
X
ఇటీవ‌లి కాలంలో స్థానిక నాయ‌కుల నుంచి మొద‌లుకొని జాతీయంగా కీల‌క నేత‌ల వ‌ర‌కు తీవ్రంగా చ‌ర్చ‌నీయాంశం అవుతున్న అంశం జ‌మిలీ ఎన్నిక‌లు. లోక్‌ సభకు - అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనను ప్రధాని మోడీ ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ ఎన్నిక‌ల‌ సాధ్యాసాధ్యాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. చట్టపరంగా కొన్ని మార్పులు చేయడంతోపాటు మౌలిక వసతులను మెరుగుపర్చుకుంటే జమిలి ఎన్నికలు సులభమేనని ఎన్నికల కమిషన్ వర్గాలు చెప్తున్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహించడం అంటే లోక్‌ సభకు - అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఒకే సమయంలో ఎన్నికలు జరుపడం. ఆయా ప్రభుత్వాల కాలపరిమితి ఒకే రోజున తీరాల్సి ఉంటుంది. నిజానికి దేశంలో జమిలి ఎన్నికల ప్రక్రియ తొలి లోక్‌ సభ * రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మొదలైంది. నాలుగో లోక్‌ సభకు ఆటంకం కలిగేంత వరకూ జమిలి ఎన్నికలు కొనసాగాయి. ఆ తర్వాత కేంద్రంలో ఆయా రాష్ర్టాల్లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కో రాష్ర్టానికి ఒక్కో కాలపరిమితి ఏర్పడుతూ వచ్చింది. కాలక్రమంలో కొన్ని రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల గడువు లోక్‌ సభ గడువు కలువడంతో లోక్‌ సభతో పాటే అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 2014లో ఏపీ - తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ర్టాలకు ఇదే కోవలో ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి.

నాలుగేళ్ల‌ పదవీకాలం ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధపడుతాయా? అన్నది జమిలి ఎన్నికల నిర్వహణలో కీలకమైనది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే విషయంలో రాష్ర్టాల్లో ప్రభుత్వాలను ఎన్నుకునే విషయంలో ఓటరు తీర్పులో తేడా ఉంటుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. లోక్‌సభకు ఒక పార్టీని గెలిపించే వాటితోపాటే జరిగిన రాష్ట్ర అసెంబ్లీలకు వేరొక పార్టీని గెలిపించిన ఉదంతాలు కోకొల్లలు. ఈ క్రమంలో లోక్‌ సభకు-అసెంబ్లీలకు ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రాంతీయ పార్టీలు అంగీకరిస్తాయా? అనేది సమస్య. సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో అవి రాష్ట్ర స్థాయిలోనైనా, లేదా కేంద్ర స్థాయిలోనైనా మెజారిటీ కోల్పోయిన పక్షంలో ఏం చేయాలి? ఒకసారి ఎన్నికైన ప్రభుత్వానికి మెజారిటీతో సంబంధం లేకుండా ఐదేళ్ల ప‌రిపాలించే అవకాశం ఇస్తారా? అనేది మరో అంశం. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతోపాటు అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించగలిగే పరిస్థితి ఎన్నికల కమిషన్‌కు ఉంటుందా? అనేది మరో చర్చనీయాంశం.

ఎన్నికలు అనగానే భారీ ఎత్తున ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అభ్యర్థులు చేసే ఖర్చుపై గరిష్ఠపరిమితి ఉన్నప్పటికీ.. అనధికారికంగా కోట్లకొద్దీ నల్లధనం మార్కెట్‌ లోకి ప్రవహించేది ఆ సమయంలోనే. జమిలి ఎన్నికలతో ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చనే అభిప్రాయం ఉంది. మ‌రోవైపు జమిలి ఎన్నికలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు.ఒక ప్రభుత్వం ఎన్నికైన తర్వాత పూర్తి అవినీతిమయంగా మారినా, లేదా ప్రజాభిప్రాయానికి భిన్నంగా పాలిస్తున్నా అప్పుడేం చేయాలనేది మరో ప్రశ్న. అది ప్రజాస్వామిక సిద్ధాంతాలకు విఘాతం కల్గిస్తుందా? అనే చర్చ కూడా ఉంది.

దాదాపు ప్రతిఏటా గరిష్ఠంగా ఐదు రాష్ర్టాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా రాష్ర్టాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పనులకు బ్రేక్ పడుతోంది. ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చుననే అభిప్రాయం ఉంది. అయితే ఒకే దేశం.. ఒకే ఎన్నికలు అన్న నినాదం దేశ సమాఖ్య వ్యవస్థకు భంగం కల్గిస్తుందనే సిద్ధాంతాలు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ప్రభుత్వాల ఏర్పాటు విషయంలో రాజ్యాంగం ఆయా రాష్ర్టాలకు కొన్ని హక్కులు కల్పించింది. జమిలి ఎన్నికలంటే వాటి హక్కులను ఉల్లంఘించడమేనన్న వాదన వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/