Begin typing your search above and press return to search.

ముక్క‌లుగా న‌రికి యాసిడ్‌ లో క‌రిగించార‌ట‌!

By:  Tupaki Desk   |   3 Nov 2018 5:12 AM GMT
ముక్క‌లుగా న‌రికి యాసిడ్‌ లో క‌రిగించార‌ట‌!
X
ప్ర‌ముఖ పాత్రికేయుడు జ‌మాల్ ఖ‌షోగ్గీ హ‌త్యోదంతం ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన వైనం తెలిసిందే. సౌదీకి చెందిన ఈ ప్ర‌ముఖ పాత్రికేయుడు ట‌ర్కీలోని సౌదీ రాయ‌బార కార్యాల‌యానికి వెళ్లి.. తిరిగి రాలేదు. దీనిపై సౌదీ రాయ‌బార కార్యాల‌యం ఎన్నో మాట‌లు చెప్పి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసింది. చివ‌ర‌కు ఒత్తిడి పెర‌గ‌టంతో చివ‌ర‌కు ఆయ‌న మ‌ర‌ణించిన విష‌యాన్ని వెల్ల‌డించ‌క త‌ప్ప‌లేదు. రాయ‌బార కార్యాల‌యంలో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో దుర‌దృష్ట‌వ‌శాత్తు ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లుగా పేర్కొన్నారు.

ఖ‌షోగ్గీ మ‌ర‌ణించిన‌ట్లు చెప్పినా.. ఆయ‌న మృత‌దేహం ఇప్ప‌టివ‌రకూ ల‌భించ‌ని ప‌రిస్థితి. దీనిపై అంత‌ర్జాతీయంగా సౌదీపై ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. సౌదీ యువ‌రాజుతో ఖ‌షోగ్గీకి ఉన్న విభేదాల‌తోనే ఆయ‌నే ఈ ప‌నంతా చేయించిన‌ట్లుగా పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇలాంటి వేళ‌.. ఖ‌షోగ్గీ మ‌ర‌ణం.. ఆయ‌న మృత‌దేహం మాయం కావ‌టంపై ట‌ర్కీ అధ్య‌క్షుడు రెసిప్ త‌య్యిప్ ఎర్డోగ‌న్ స‌ల‌హాదారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఖ‌షోగ్గీ మృత‌దేహాన్ని ముక్క‌లు.. ముక్క‌లుగా న‌రికి యాసిడ్‌ లో క‌రిగించి మాయం చేసిన‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఉదంతంపై త‌మ ద‌ర్యాప్తు అధికారులు విచార‌ణ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. "ఆయ‌న శ‌రీర భాగాల్ని కేవ‌లం ముక్క‌లుగా మాత్ర‌మే చేయ‌లేదు.. వాటి ఆన‌వాళ్లు లేకుండా చేసేందుకు యాసిడ్‌ లో క‌రిగించి వేశారు" అంటూ చెప్పారు.

త‌న‌పై వ‌రుస విమ‌ర్శ‌లు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఖ‌షోగ్గీని అంతం చేసేందుకు సౌదీ రాజు ఇదంతా చేసిన‌ట్లుగా వ‌స్తున్న ఆరోప‌ణ‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. అంత‌ర్జాతీయంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉండ‌గా.. ట‌ర్కీలోని సౌదీ రాయ‌బార కార్యాల‌యంలోకి ఖ‌షోగ్గీ వెళ్లినంత‌నే ఆయ‌న గొంతు నులుమి చంపేశార‌ని.. త‌ర్వాత ముక్క‌లుగా న‌రికి యాసిడ్ లో క‌రిగించార‌ని ట‌ర్కీ ప్ర‌ధాన ప్రాసిక్యూట‌ర్ స్ప‌ష్టం చేయ‌టం గ‌మ‌నార్హం.

ఖ‌షోగ్గీ అదృశ్యంపై సౌదీ కాన్సులేట్‌ను త‌నిఖీ చేసేందుకు.. అక్క‌డి బావిని ప‌రిశీలించేందుకు సౌదీ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌లేదు. కాకుంటే నీళ్ల శాంపిల్స్ తీసుకునేందుకు మాత్రం ఓకే చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఖ‌షోగ్గీ అదృశ్యం.. మృతి చెందిన వైనం సంచ‌ల‌నంగా మారితే.. తాజాగా ఆయ‌న మృత‌దేహాన్ని మాయం చేసిన వైనం ఇప్పుడు మ‌రింత సంచ‌ల‌నంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.