Begin typing your search above and press return to search.

జ‌ల్లిక‌ట్టు స్ఫూర్తితో వారూ క‌దం తొక్కుతారా..?

By:  Tupaki Desk   |   21 Jan 2017 11:32 AM GMT
జ‌ల్లిక‌ట్టు స్ఫూర్తితో వారూ క‌దం తొక్కుతారా..?
X
జ‌ల్లిక‌ట్టు చ‌ట్ట విరుద్ధం అని చెబుతున్నా స‌రే... త‌మిళ ప్ర‌జ‌లు ఉడుంప‌ట్టు ప‌ట్టేశారు. అనుకున్న‌ది సాధించుకున్నారు. జ‌ల్లిక‌ట్టును సుప్రీం కోర్టు నిషేధించినా... త‌మిళులు క‌లిసిక‌ట్టుగా ఉద్య‌మించి ఆర్డినెన్స్ ద్వారా అనుకున్న‌ది తెచ్చుకున్నారు. త‌మిళులు క‌ట్ట‌క‌ట్టుకుని ఉద్య‌మించ‌డం దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వారి ఐకమత్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఈ సంద‌ర్భంలోనే తమిళుల‌ను ఆద‌ర్శంగా తీసుకుని ఉద్య‌మించేందుకు కూడా కొంత‌మంది సిద్ధ‌మౌతున్నారు.

జ‌ల్లిక‌ట్టుతోపాటు ఎడ్ల పందేల‌ను కూడా సుప్రీం కోర్టు నిషేధించింది. అయితే, జ‌ల్లిక‌ట్టును త‌మిళులు తిరిగి సాధించుకున్న నేప‌థ్యంలో ఎడ్ల పందేల‌ను కూడా పున‌రుద్ధ‌రించుకోవాల‌ని శివ‌సేన సిద్ధ‌మౌతోంది. వినాయక న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా పుణెలో ఎడ్ల పందేలు ప్ర‌తీయేటా జ‌రుగుతూ ఉంటాయి. స‌ర్వోన్నత న్యాయ‌స్థానం తీర్పు నేప‌థ్యంలో ఎడ్ల పందేల‌ను నిలిపేయాల్సి వ‌చ్చింది. ఇప్పుడు త‌మిళులు ఆందోళ‌నకు దిగిన నేప‌థ్యంలో... సంప్ర‌దాయ ఎడ్ల పందేల‌ను తాము కూడా సంర‌క్షించుకుంటామ‌ని శివ‌సేన క‌దంతొక్కుతోంది. త్వ‌ర‌లోనే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్య‌మించి, ఎడ్ల పందేల నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తులు తెచ్చుకుంటామ‌ని శివ‌సేన పార్టీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. జ‌ల్లిక‌ట్టు ప్ర‌భావం ఒక్క మ‌హారాష్ట్రకు మాత్ర‌మే ప‌రిమితం కాలేదు. అసోం ప్ర‌జ‌లు కూడా ఉద్య‌మానికి సిద్ధ‌మౌతున్నారు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సంక్రాంతికి కోడి పందేలు జ‌రుగుతున్న‌ట్టుగానే... అసోంలో బుల్ బుల్ పిట్ట‌ల పందేలు ఉంటాయి. పంట‌లు చేతికి వ‌చ్చిన సంద‌ర్బంగా అసోం ప్ర‌జ‌లు బోగాలీ బిహు అనే పండుగ‌ను చేసుకుంటారు. ఈ పండుగ‌ల్లో బుల్ బుల్ పిట్ట‌ల పందేలు వారికి ఓ ఆన‌వాయితీ. అయితే.. వీటిపై కూడా సుప్రీం కోర్టు నిషేధం ఉంది. కోర్టు తీర్పు కార‌ణంగా కొన్నాళ్లుగా ఈ పిట్ట‌ల పందేలు కూడా నిలిచిపోయాయి. జ‌ల్లిక‌ట్టుపై త‌మిళ ప్ర‌జ‌ల పోరాటం విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు తామూ అదే బాట‌లో ప‌య‌నిస్తామ‌ని అసోం ప్ర‌జ‌లు అంటున్నారు. త‌ర‌త‌రాలుగా వ‌స్తున్న సంప్ర‌దాయ బుల్ బుల్ పిట్ట‌ల పందేలపై నిషేధాన్ని ఎత్తేయాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామ‌ని అంటున్నారు. మొత్తానికి.. త‌మిళ ప్ర‌జ‌ల పోరాటం ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా మారింద‌ని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/