Begin typing your search above and press return to search.

జల్లికట్టు ఆడతారా? ఎద్దులతో కాదు.. పందులతో!

By:  Tupaki Desk   |   20 Jan 2021 2:30 PM GMT
జల్లికట్టు ఆడతారా? ఎద్దులతో కాదు.. పందులతో!
X
జల్లికట్టు పేరు వినగానే సామాన్యులకు వెన్నులో వణుకు పుడుతుంది. వాడి కొమ్ములు తిరిగిన ఎద్దులు.. అంతకు మించిన వేడితో, వేగంతో దూసుకొస్తుంటే సవాల్ చేసి నిలబడాలి. కాళ్లూ చేతులు విరగొచ్చు.. తలలు పగిలిపోవచ్చు.. ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోవచ్చు. ఇలా ఉంటుంది మనందరికీ తెలిసిన రక్తక్రీడ. అయితే.. దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది మరో జల్లికట్టు. పందులతో ఆడే ఈ ఆట ఎంతో వినోదాత్మకంగా ఉంటుంది. మరి, దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఛలో చెన్నై.

ఎక్కడ..?
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బసవన్నలతో జల్లికట్టు పోటీలు పెద్ద ఎత్తున జరుగుతాయి. అయితే.. ఇదే సంక్రాంతి వేళ 'పందులతో జల్లికట్టు' పోటీలు కూడా ఇదే రాష్ట్రంలో జరుగుతాయి. అయితే.. ఈ పోటీలు ఒకే గ్రామంలో జరుగుతాయి. తేని జిల్లాలోని వల్లినగరంలో ఈ 'పందుల జల్లికట్టు' పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ ప్రాంతంలో కురువర్‌ వర్గానికి చెందిన 50కి పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరంతా ప్రతి ఏటా.. పందుల జల్లికట్టు నిర్వహిస్తుంటారు.

రూల్స్ కంపల్సరీ..
అయితే.. ఈ పోటీల్లో పాల్గొనే పందులకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా 70 నుంచి 100 కిలోల మధ్య బరువు ఉండాలి. ఎలా తెలుస్తుంది అనుకుంటారేమో..? పోటీలో పాల్గొనే ముందు వాటి బరువును తప్పకుండా చూస్తారు. లేదంటే డోప్ టెస్టులో పట్టుబడ్డ క్రీడాకారుడిలా 'గెట్ ఔట్' అంటారు.

పోటీ ఎలా..?
పందిని స్టార్టింగ్ పాయింట్ దగ్గర వదులుతారు. దాన్ని పట్టుకోవాల్సిన మనిషి ఎదురుగా ఉంటాడు. పందిని వదిలిన తర్వాత అది మూడు అడుగుల దూరం కదిలిన తర్వాతే దానిని పట్టుకోవాలి. ఎండింగ్ పాయింట్ కు పరిగెత్తే వరకూ ప్రయత్నించుకోవచ్చు. చివరి లైన్‌ దాటేలోపు ఈ పందిని పట్టేసుకోవాలి. అయితే.. ఎక్కపడితే అక్కడ పట్టుకుంటానంటే కుదరు. కేవలం పంది వెనుక కాళ్లు మాత్రమే పట్టుకొని దాన్ని నిలువరించాలన్నమాట.

విజేత పంది కావొచ్చు.. మనిషి కావొచ్చు..!
ఈ పోటీలు మనిషే కాదు పంది కూడా గెలిచే ఛాన్స్ ఉంటుంది. అంటే.. ఫినిషింగ్ లైన్ దాటేలోపు మనిషి దాన్ని పట్టుకుంటే అతడు గెలిచినట్టు. లేదంటే పంది గెలిచినట్టుగా ప్రకటిస్తారు. ఈ సంవత్సరం ఈ పందుల పోటీల్లో పాల్గొందుకు తేని, దిండుగల్‌, మదురై జిల్లాల నుంచి 12 పందుల రాగా.. 45 మంది యువకులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ వింత జల్లికట్టును వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

కాగా.. తమిళనాడులోని పలు జిల్లాల్లో పందుల్ని విరివిగా పెంచుతుంటారు. వీటిద్వారా మంచి ఆదాయం లభిస్తుందని స్థానికులు చెబుతున్నారు. పందుల్ని పెంచటం చాలా ఈజీ అనీ.. వాటికి ప్రత్యేకమైన ఆహారం అంటూ ఏదీ పెట్టనవసరం లేదనీ అంటున్నారు. పెరిగిన తర్వాత మాంసం కోసం వీటిని అమ్ముకుంటే మంచి ఆదాయం వస్తుందని అంటున్నారు.