Begin typing your search above and press return to search.

జ‌ల్లిక‌ట్టుపై సుప్రీం మళ్లీ టెన్ష‌న్ పెట్టేసింది

By:  Tupaki Desk   |   25 Jan 2017 1:10 PM GMT
జ‌ల్లిక‌ట్టుపై సుప్రీం మళ్లీ టెన్ష‌న్ పెట్టేసింది
X
త‌మిళుల సంప్ర‌దాయ క్రీడ జ‌ల్లిక‌ట్టుపై నెల‌కొన్న ఉత్కంఠ‌ ఇంకా కొన‌సాగుతోంది. జ‌ల్లిక‌ట్టు నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ చెన్నైలోని మెరీనా బీచ్‌లో నెల‌కొన్న ఆందోళ‌న‌లు కొలిక్కి వ‌స్తున్న స‌మ‌యంలోనే సుప్రీంకోర్టు మ‌రో నిర్ణ‌యం వెలువ‌రించింది. జ‌ల్లిక‌ట్టును వ్య‌తిరేకించాల‌ని కోరుతూ ప‌లు సంస్థ‌లు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను విచారించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అనిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఏడబ్ల్యూబీఐ) వేసిన పిటిష‌న్ ను విచారణ‌కు స్వీక‌రిస్తూ స‌ర్వోన్న‌త న్యాయస్థానం ఈ మేర‌కు త‌న నిర్ణ‌యం వెలువ‌రించింది. ఏడబ్ల్యూబీఐ - పెటా స‌హా మిగ‌తా సంస్థ‌ల‌న్నీ వేసిన పిటీష‌న్ల‌ను ఈనెల 30న విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

జల్లికట్టు పేరుతో జంతువులను యధేచ్ఛగా హింసిస్తున్నారంటూ పెటా పిటిష‌న్ వేయ‌గా గ‌తేడాది సుప్రీంకోర్టు నిషేధం విధించింది. దీంతో సంక్రాంతి సంద‌ర్భంగా ఈ క్రీడ నిర్వ‌హించ‌డంపై సందేహాలు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలో మెరీనా బీచ్‌ లో ఆందోళ‌న‌లు రేకెత్తగా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. అనంత‌రం హుటాహుటిన అసెంబ్లీ స‌మావేశం ఏర్పాటుచేసి జ‌ల్లిక‌ట్టు నిర్వహ‌ణ‌కు అనుకూలంగా సభ ఆమోదం పొందింది. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ అనిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. దీనిపై స్పందించిన స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం జ‌ల్లిక‌ట్టు వ్య‌తిరేక పిటిషన్లు అన్నింటినీ వ్య‌తిరేకిస్తూ జ‌న‌వ‌రి 30న విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపింది.

ఇదిలాఉండ‌గా జ‌ల్లిక‌ట్టుకు వ్య‌తిరేకంగా సుప్రీంకోర్టు నిర్న‌యం వెలువ‌రుస్తుంద‌నే క్ర‌మంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి మార్కండేయ క‌ట్జూ స్పందిస్తూ రాజ్యాంగంలోని అధికరణ 254(2) ప్రకారం జల్లికట్టు బిల్లుకు రక్షణ లభిస్తుందని, కాబట్టి జల్లికట్టు అభిమానులు భయపడాల్సిన అవసరం లేదని ధీమా వ్య‌క్తం చేశారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/