Begin typing your search above and press return to search.

ఆ న‌లుగురికీ ఉరి..కోర్టు సంచ‌ల‌న తీర్పు

By:  Tupaki Desk   |   20 Dec 2019 4:03 PM GMT
ఆ న‌లుగురికీ ఉరి..కోర్టు సంచ‌ల‌న తీర్పు
X
సంచ‌ల‌నం రేపిన 2008 జైపూర్ పేలుళ్ల కేసులో తీర్పు కూడా సంచ‌ల‌న‌మే. ఈ కేసును విచారించిన‌ రాజస్థాన్ ప్రత్యేక కోర్టు దోషులుగా తేలిన నలుగురు నిందితులకు మరణశిక్ష విధిస్తూ శుక్ర‌వారం తీర్పు చెప్పింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితుల ప్ర‌మేయం విచారించిన కోర్టు నలుగురిని దోషులుగా ప్ర‌క‌టిస్తూ బుధ‌వారం తీర్పు చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ న‌లుగురికీ ఉరి శిక్ష అమ‌లు చేయాల‌ని తాజాగా తీర్పిచ్చింది. మరో వ్యక్తిపై ఆరోపణలు రుజువుకాకపోవడంతో అతడిని నిర్దోషిగా కోర్టు ప్ర‌క‌టించింది. సైఫూర్ రెహ్ మాన్ - సర్వార్ అజ్మీ - మహ్మద్ సైఫ్ - సల్మాన్‌ ల‌కు ఉరి శిక్ష ప‌డింది. మరో నిందితుడు షాబాజ్ హుస్సేన్ నిర్దోషిగా బయటపడ్డాడు.

2008 మే 13న‌ జైపూర్‌ పాత నగరంలోని హనుమాన్‌ ఆలయ సమీపంలో 9 వరుస పేలుళ్లు జరిగాయి. 2 కిలోమీటర్ల పరిధిలో 15 నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 72 మంది మృతి చెందగా - 170 మంది గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ స్పెషన్ సెల్ పోలీసులు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అరిజ్ ఖాన్ అలియాస్ జునైద్‌ ను అరెస్టు చేశారు. ఢిల్లీ - జైపూర్ - అహ్మదాబాద్ సహా 2008లో చోటుచేసుకున్న వరుస పేలుళ్లకు జునైద్ కీలక సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. కాగా ఉరి శిక్ష ప‌డ్డ నిందితులు పై కోర్టులో అప్పీల్‌ కు వెళ్ల‌నున్న‌ట్లు తెలిసింది.