Begin typing your search above and press return to search.

తెలంగాణ కోసం సోనియమ్మ‌కు నిజాలు చెప్ప‌లేద‌ట‌!

By:  Tupaki Desk   |   26 March 2019 4:50 AM GMT
తెలంగాణ కోసం సోనియమ్మ‌కు నిజాలు చెప్ప‌లేద‌ట‌!
X
నేను తెలంగాణ తీసుకొచ్చాను. కేంద్రం ముక్కు పింది మ‌రీ కొత్త రాష్ట్రాన్ని తెచ్చాడీ బ‌క్క‌డంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అదే ప‌నిగా గొప్ప‌లు చెప్పుకుంటూ ఉంటారు. రెండంటే రెండు ఎంపీ స్థానాలున్న త‌మ పార్టీ ఢిల్లీలో చ‌క్రం తిప్పి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వైనాన్ని క‌థ‌లు.. క‌థ‌లుగా చెబుతుంటారు కేసీఆర్‌.

అయితే.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌టం వెనుక ఉన్న అస‌లు విష‌యాన్ని ఇప్ప‌టివ‌ర‌కూ చాలామంది కాంగ్రెస్ నేత‌లు బ‌య‌ట‌పెట్టింది లేదు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం.. తెర వెనుక జ‌రిగిన చాలా విష‌యాల్ని బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా చేశార‌ని చెప్పాలి. అయితే.. కాలం ఇలాంటి దాప‌రికాల్ని బ‌ద్ధ‌లు చేయ‌ట‌మే కాదు.. ఎవ‌రైతే దాచారో.. ఎవ‌రైతే క‌థ న‌డిపారో.. అలాంటి వారే త‌మ‌కు తాముగా నిజాలు చెప్పేస్తుంటారు. తాజాగా అలానే జ‌రిగిన ముచ్చ‌ట మొత్తాన్ని చెప్పుకొచ్చారు మాజీ కేంద్ర‌మంత్రి.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత జైపాల్ రెడ్డి.
తాజాగా నిర్వ‌హించిన ఒక స‌మావేశంలో ఆయ‌న సంచ‌ల‌న విష‌యాల్ని వెల్ల‌డించారు.

కేసీఆర్ నిర‌వ‌ధిక నిరాహార దీక్ష‌కు సంబంధించిన నిజం త‌మ‌కు తెలిసినా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌లేద‌న్నారు. తెలంగాణ ఏర్పాటుకు అడ్డుగా ఉంటుంద‌న్న ఉద్దేశంతో పార్టీ అధినేత్రి సోనియ‌మ్మ‌కు సైతం కొన్ని నిజాల్ని చెప్ప‌లేద‌న్న షాకింగ్ విష‌యాల్ని జైపాల్ తాజాగా చెప్పుకొచ్చారు.

నాడు సిద్దిపేట‌లో నిర‌వ‌ధిక నిరాహార దీక్ష చేసిన కేసీఆర్ 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే దీక్ష‌ను ముగించార‌ని.. అలాంటి ఆయ‌న ఖ‌మ్మం దీక్షలో భాగంగా నిమ్స్ లో చేర‌టం.. రోజుకు 750 కేల‌రీల ద్ర‌వాహారాన్ని తీసుకోవటాన్ని తాజాగా జైపాల్ రివీల్ చేశారు.

అలా ద్ర‌వాహారాన్ని తీసుకుంటే ఎంత‌కాల‌మైనా జీవించొచ్చు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధ‌న విష‌యంలో అవ‌రోదం ఏర్ప‌డుతుంద‌న్న ఉద్దేశంతో కేసీఆర్ చేసిన మోసాలు.. దొంగ దీక్ష‌ల ర‌హ‌స్యాల గురించి నాటి పార్టీ చీఫ్ సోనియాగాంధీకి నిజాలు చెప్ప‌లేద‌ని చెప్పారు. ఉద్యోగుల‌కు జీతాలు.. విద్యార్థుల‌కు ఫీజులు తిరిగి చెల్లించే ప‌రిస్థితి రాష్ట్రంలో లేద‌న్న ఆయ‌న‌.. రానున్న కొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ఎమ‌ర్జెన్సీ రానున్న‌ట్లు చెప్పారు. తెలంగాణ‌లో ఆర్థిక ఎమ‌ర్జెన్సీ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీల‌కంగా చెప్పే దీక్ష‌ల గురించి.. కేసీఆర్ చేసిన మేజిక్ ల నిజాలు తెలిసినా.. ఆ విష‌యాల్ని పార్టీ చీఫ్ కు చెప్ప‌క‌పోవ‌టం చూస్తే.. అధినేత‌ను అడ్డ‌దారి ప‌ట్టించిన నిజాన్ని జైపాల్ ఈ రోజున త‌న నోటితో తానే చెప్పిన‌ట్లైంది. మ‌రి.. ఈ విష‌యాల్ని సోనియ‌మ్మ దృష్టికి తీసుకెళ్లేదెవ‌రు?