Begin typing your search above and press return to search.

‘టీ’ క్రెడిట్ మొత్తంగా తమకే ఇచ్చేసుకున్నారు

By:  Tupaki Desk   |   2 Aug 2015 10:13 AM GMT
‘టీ’ క్రెడిట్ మొత్తంగా తమకే ఇచ్చేసుకున్నారు
X
తెలంగాణ రాష్ట్రం ఎవరి కారణంగా వచ్చేసింది? చెట్టు ముందా? విత్తు ముందా? అన్నట్లుగా ఉండే ఈ ప్రశ్నకు ఎవరికి వారు సమాధానాలు తమకు తోచిన విధంగా ఇచ్చేస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చేసిన మొదట్లో.. క్రెడిట్ అంతా సోనియమ్మకే కట్టబెట్టిన కేసీఆర్.. ఆ తర్వాత మాత్రం.. తెలంగాణ జాతిపిత స్వప్నంతో ఆ మాటను ప్రస్తావించటం తగ్గించేశారు.

ఉన్న విషయాన్ని నలుగురికి చెప్పుకోవటం ఏ మాత్రం చేతకాని కాంగ్రెస్ నేతలకు.. తెలంగాణ రాష్ట్రం లాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసినప్పటికీ.. ఆ క్రెడిట్ తమదేనని చెప్పుకోవటం చేతకాక.. బొక్క బోర్లా పడ్డారు. ఈ కారణంతోనే.. తెలంగాణ రాష్ట్రం కానీ ఇస్తే.. తెలంగాణలో అధికారం తమకు ఖాయమన్న వాదనను బలంగా వినిపించినా.. తుది ఫలితం మాత్రం అందుకు భిన్నంగా వచ్చిన పరిస్థితి.

తెలంగాణలో టీఆర్ ఎస్ సర్కారు ఏర్పడిన 14 నెలల తర్వాత.. తాజాగా మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీకే కట్టబెట్టే ప్రయత్నం చేశారు. తాము బిల్లు తీసుకొచ్చిన క్షణంలో కానీ.. తేకుంటే.. తెలంగాణ కల ఎప్పటికి సాధ్యం అయ్యేది కాదని ఆయన చెప్పుకొచ్చారు. దీని కోసం కాంగ్రెస్ చాలానే కసరత్తు చేసిందని తాము పడిన కష్టాన్ని మాటల్లో కుదించే ప్రయత్నం చేశారు.

జైపాల్ రెడ్డి లాంటి నేత.. తెలంగాణ క్రెడిట్ తమదేనని చెప్పుకుంటే.. అడ్డుకోవటానికి టీఆర్ ఎస్ నేతలు ఎవరూ లేకపోవటంతో.. ఏకపక్షంగా సాగిపోయింది. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కోదండం మాష్టారు ఉన్నా.. జైపాల్ రెడ్డి స్థాయి నేత నోట వెంట క్రెడిట్ మాటలు వస్తే ఆయన మాత్రం అడ్డు చెప్పే పరిస్థితి ఉండదు కదా. జైపాల్ రెడ్డి మాదిరి కాంగ్రెస్ నేతలంతా కానీ.. ఇదే తీరులో ప్రచారం చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న నిట్టూర్పుల్ని కొందరు టీ కాంగ్రెస్ నేతలు విడుస్తున్నారు.