Begin typing your search above and press return to search.

జైపాల్ రెడ్డి... మోదీని చెడుగుడు ఆడేశారే!

By:  Tupaki Desk   |   10 Sep 2017 9:48 AM GMT
జైపాల్ రెడ్డి... మోదీని చెడుగుడు ఆడేశారే!
X
కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర మాజీ మంత్రి ఎస్‌. జైపాల్ రెడ్డి మీడియా ముందుకు రావ‌డం దాదాపుగా అరుదేన‌ని చెప్పాలి. అయితే ఆయ‌న గ‌నుక మీడియా ముందుకు వ‌చ్చారంటే... అవ‌త‌లి వారికి ప‌గిలిపోవాల్సిందే. గ‌తంలో కేంద్ర మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే కాకుండా... తెలంగాణ ఉద్య‌మం పీక్స్‌ కు వెళ్లిన‌ప్పుడు కూడా జైపాల్ ఏ వ్యాఖ్య చేసినా... అది సంచ‌నంగా మారింద‌న్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఇస్తున్న స‌మ‌యంలో కాంగ్రెస్‌ - టీఆర్ ఎస్‌ ల మ‌ధ్య కుదిరిన ఒప్పందం గ‌నుక కార్య‌రూపం దాల్చి ఉంటే... ఇప్పుడు కేసీఆర్ కూర్చున్న కుర్చీలో జైపాల్ రెడ్డి కూర్చుని ఉండేవారు. ఏం చేస్తాం... టైం బాగోలేన‌ప్పుడు కేసీఆర్ చ‌తుర‌త పుణ్య‌మా అని జైపాల్ రెడ్డికి తెలంగాణ సీఎం పోస్టు ద‌క్క‌క‌పోగా.. ఇప్పుడు రాజ‌కీయాల్లో ఆయ‌న దాదాపుగా సైలెంట్ అయిపోయార‌న్న వాద‌న వినిపిస్తోంది.

వ‌య‌సు మీద‌ప‌డ‌టం - పార్టీలో కొత్త ర‌క్తంతో పాటు పాత ర‌క్తం కూడా ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేని నేప‌థ్యంలో జైపాల్ రెడ్డి ఒక్క‌డిగా ఏం చేస్తారు చెప్పండి. ఎంతైనా కాక‌లు తీరిన రాజ‌కీయ వేత్త‌గా పేరున్న జైపాల్ రెడ్డి... క్రియాశీలంగా లేకున్నా... అప్పుడ‌ప్పుడు మీడియా ముందుకు రావాల్సిందే క‌దా. ఈ త‌ర‌హాలోనే నిన్న హైద‌రాబాదులోని కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యం గాంధీ భ‌వ‌న్‌ లో జ‌రిగిన పార్టీ కార్య‌కర్త‌ల శిక్ష‌ణా శిబిరంలో పాలుపంచుకున్న సంద‌ర్భంగా జైపాల్ రెడ్డి త‌న‌దైన స్టైల్లో మ‌రోమారు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అయినా ఈ ద‌ఫా జైపాల్ రెడ్డికి టార్గెట్లుగా మారిన వారెవ‌రో తెలుసా... ఇంకెవ‌రు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ - తెలంగాణ సీఎం కేసీఆర్లే. మోదీపై త‌న‌దైన స్టైల్లో ఒంటికాలిపై లేచిన జైపాల్ రెడ్డి... అస‌లు మోదీ పేరుకే ప్ర‌ధాని అని, ఆయ‌న‌ను న‌డిపిస్తోంది ఆరెస్సేన‌ని కూడా ఆరోపించారు.

దేశాన్ని కాషాయీకరణ చేయాలని చూస్తున్నారని జైపాల్ రెడ్డి మండిపడ్డారు. ఇక ఆరెస్సెస్‌ నూ వ‌ద‌ల‌ని జైపాల్‌... ఆ సంస్థ‌ను పారదర్శకత లేని సంస్థగా అభివ‌ర్ణించారు. స్వాతంత్ర్య సమరంలో ఏనాడూ ఆరెస్సెస్‌ పాల్గొనలేదన్న జైపాల్‌... త్రివర్ణ పతాకాన్ని సైతం ఆ సంస్థ ఒప్పుకోలేదని చెప్పారు. 2002 వరకు నాగ్‌ పూర్ ఆరెస్సెస్‌ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరలేదని కూడా ఆయ‌న గుర్తు చేశారు. ఆ త‌ర్వాత కేసీఆర్‌ ను టార్గెట్ చేసిన జైపాల్ రెడ్డి...అందమైన అబద్దాలు చెప్పడంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీతో పోటీ పడుతున్నారని విమర్శించారు. మోడీ - కేసీఆర్ ఇద్దరూ ఒకటేనని - వారిద్దరి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని కేసీఆర్‌ కు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామన్న జైపాల్ రెడ్డి.. కేసీఆర్‌ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని తేల్చేశారు.