Begin typing your search above and press return to search.

ఇది డ్రామా... కేసీఆర్ ఎప్ప‌టికీ మోడీ ఫ్రెండే!

By:  Tupaki Desk   |   4 March 2018 6:59 AM GMT
ఇది డ్రామా... కేసీఆర్ ఎప్ప‌టికీ మోడీ ఫ్రెండే!
X
తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖరరావుపై కేంద్ర మాజీ మంత్రి - కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ ఎస్‌ జైపాల్‌ రెడ్డి విరుచుకుప‌డ్డారు. ప్రజలను మోసం చేయడానికే కేసీఆర్‌ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఇది లాలుచీ కుస్తీ అని ఎద్దేవా చేశారు. నమ్మదగిన వ్యక్తి కాదని - ఆయన మోడీతోనే ఉంటారని చెప్పారు. మేధావులను - ప్రజాస్వామ్యవాదులను - ప్రజాసంఘాలను మోసం చేయడానికే ఆయన మోడీపై పరుష పదజాలం ఉపయోగించారని చెప్పారు. తెలంగాణలో టీఆర్‌ ఎస్‌ కు కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయం కాబట్టి జాతీయస్థాయిలో కేసీఆర్‌ మోడీతోనే పోతారని చెప్పారు.

ఇతర పార్టీ నాయకుల పట్ల అసభ్యకరంగా - అనాగరికంగా మాట్లాడం కేసీఆర్‌ నైజమని జైపాల్ రెడ్డి ఆరోపించారు. సిద్ధాంతపరంగా బీజేపీ భావజాలానికి కేసీఆర్‌ భావజాలం చాలా దగ్గరగా ఉంటుందని చెప్పారు. 2009 ఎన్నికల్లో ఎన్డీఏ గెలువక ముందే కేసీఆర్‌ అత్యుత్సావం ప్రదర్శించి గెలిచిందని చెప్పారని, అయితే యూపీఏ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీతో సర్దుబాటుకు కేసీఆర్‌ ఎంతో ప్రయత్నించారని, ఆ సమయంలో టీఆర్‌ ఎస్‌ తో పొత్తును బీజేపీయే తిరస్కరించిందన్నారు. ఈ పరంపర రానున్న ఎన్నికల్లో నిజం కాబోతుందన్నారు. బీజేపీతో పోవడం మినహా కేసీఆర్‌ కు మరో గత్యంతరం లేదని చెప్పారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రి రేసులో లేనని - మహబూబ్‌ నగర్‌ పార్లమెంటు నుంచి పోటీ చేస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఎక్కువగా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత విషయాలపై జోక్యం చేసుకోబోనన్నారు.

దేశంలో కూడా బీజేపీ - కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉంటుందని జైపాల్ రెడ్డి అన్నారు. నోట్ల రద్దు - జీఎస్టీ తేవడాన్ని కూడా కేసీఆర్‌ పొగిడి అభాసుపాలయ్యారన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ పునాదిని బీజేపీ మతం పేరుతో విడగొట్టిందని మండిపడ్డారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బాగా బలహీనపడిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.