Begin typing your search above and press return to search.

ఉండవల్లి విభజన కథ.. కట్టుకథా?

By:  Tupaki Desk   |   21 Sept 2016 5:25 PM IST
ఉండవల్లి విభజన కథ.. కట్టుకథా?
X
ఏపీ విభజన బిల్లు సమయంలో అప్పటి కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ - బీజేపీ ఫ్లోర్ లీడర్ సుష్మా స్వరాజ్ కాళ్లు పట్టుకున్నారంటూ మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన పుస్తకంలో రాయడాన్ని మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తప్పు పట్టారు. ఉండవల్లి రాసిన విభజన కథ- నా డైరీలో కొన్ని పేజీలు అనే పుస్తకంలోని పలు అంశాలను ఆయన ఖండించారు.

విభజన బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో హౌస్ ప్రసారాలను నిలిపివేయమని తాను చెప్పలేదని అన్నారు. ప్రసారాలు నిలిపివేయడానికి - విభజన బిల్లు ఆమోదింపజేయడానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. హౌస్ ప్రసారాలను నిలిపివేయడమనేది స్పీకర్ వివేచనపై ఆధారపడి ఉంటుందన్నారు. బహుశ హౌస్ లో పెప్పర్ స్ప్రే కొట్టినందునే, నాడు ప్రసారాలను నిలిపివేసి ఉంటారని తాను భావిస్తున్నానని జైపాల్ రెడ్డి అన్నారు. ప్రసారాలు నిలిపివేయాలని తాను సలహా ఇచ్చినట్లు ఉండవల్లి రాశారని.. కానీ, తానేమీ అలా చెప్పలేదని జైపాల్ అన్నారు.

విభజనకు సంబంధించి స్పీకర్ చాంబర్ లో జరిగిన చర్చపై ఉండవల్లి అరుణ్ కుమార్ తన పుస్తకంలో రాసిందంతా కట్టుకథ అని జైపాల్ మండిపడ్డారు. విభజన బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో కాంగ్రెస్ ఎంపీలతో పాటు సుష్మా స్వరాజ్ - ఇతర బీజేపీ సభ్యులు - ఎల్కే అద్వానీ కూడా స్వయంగా లేచి నిలబడ్డారని.. ఎవరూ ఎవరి కాళ్లు పట్టుకోలేదని.. ఆ రోజు స్పీకర్ ఛాంబర్ లో ఏమి జరిగిందో ఉండవల్లికి తెలియదని - ఊహించి రాయడానికి ఆయనకే మన్నా దివ్యదృష్టి ఉందా? అని జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఉండవల్లికే కాదు - కేసీఆర్ కు కూడా స్పీకర్ ఛాంబర్ లో ఏం జరిగిందో తెలియదని ఆయన చెప్పారు. తెలంగాణ బిల్లు పెడితే మద్దతు ఇస్తామని సుష్మా స్వరాజ్ చెప్పారని, నిబంధనల ప్రకారమే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని చెప్పారు. విభజన బిల్లు ఆమోదం పొందడంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఉండవల్లి తన పుస్తకంలో రాశారని.. ఆ మాట మాత్రం నిజమని.. తాను అన్ని ప్రయత్నాలు చేశానని చెప్పుకొచ్చారు.