Begin typing your search above and press return to search.

లైవ్ లో సామెతను చెప్పిన ఆ లేడీ జర్నలిస్టుకు జైలు

By:  Tupaki Desk   |   24 Jan 2022 4:08 AM GMT
లైవ్ లో సామెతను చెప్పిన ఆ లేడీ జర్నలిస్టుకు జైలు
X
కొన్ని దేశాల్లోని చట్టాలు ఎంతలా ఉంటాయి? అక్కడి ప్రభుత్వాలు తమను విమర్శించిన వారి విషయంలోఎంత కఠినంగా ఉంటారన్న విషయానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ ఉదంతం నిలుస్తుంది. టర్కీకి చెందిన ఒక మహిళా జర్నలిస్టు తాజాగా జైలు పాలయ్యారు. ఇంతకూ ఆమె చేసిన ఘోరమైన తప్పిదం ఏమిటో తెలుసా? ఆ దేశ అధ్యక్షుడ్ని ఉద్దేశించి సామెతను చెప్పటమే.

ఆ సామెతకు కన్నెర్ర చేసిన ఆ దేశ సర్కారు ఆమెను అరెస్టు చేయటమే కాదు.. జైల్లో పడేశారు. తీవ్రమైన కేసుల్ని ఆమెపై నమోదు చేశారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలో.. ఇంతకీ ఆజర్నలిస్టు ఎవరు? ఏ సందర్భంలో ఆమె సామెత చెప్పారు? ఇంతకూ ఆమె చెప్పిన సామెతలో అరెస్టు చేసేంత దారుణమైన బూతు ఉందా? లాంటి ప్రశ్నలకు సమాధానం వెతికితే.. టర్కీలోని ప్రభుత్వ తీరు ఎలా ఉంటుందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

టర్కీకి చెందిన ప్రముఖ మహిళా పాత్రికేయురాలు సెడెఫ్ కబాస్. ఆమెకు53 ఏళ్ల వయసు. నిర్మోహమాటంగా మాట్లాటం ఆమెకు అలవాటు. ప్రశ్నించే ధర్మాన్ని ఆమె వదులుకోరు. మూడు దశాబ్దాలుగా పాత్రికేయంలోఉన్న ఆమె.. తాజాగా టర్కీ దేశాధ్యక్షుడు రెసెప్ తయ్యప్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒక టీవీ చానల్ లో జరిగిన చర్చ సందర్భంగా దేశాధ్యక్షుడ్ని ఉద్దేశించి కాసింత ఘాటైన వ్యాఖ్యను.. ఒక సామెతను గుర్తు చేస్తూ చెప్పారు. ఇది కాస్తా పెను సంచలనంగా మారటమేకాదు.. సదరు దేశాధ్యక్షుడికి ఎక్కడో కాలేలా చేసిందని చెబుతున్నారు.

టర్కీ దేశాధ్యక్షుడు రెకెప్ తయ్యిప్ ఎర్డొగన్ ను ఉద్దేశించి లైవ్ లో సదరు మహిళా జర్నలిస్టు చెప్పిన సామెతను చూస్తే ‘‘కిరీటం పెట్టుకున్న తల తెలివైనదనేది ప్రసిద్ధమైన సామెత. అది నిజం కాదని మనం చూస్తున్నాం. రాజ భవనంలోకి ప్రవేశించినంత మాత్రాన ఎద్దు రాజుగా మారదు. కానీ.. రాజభవనం మాత్రం పశువుల కొట్టంగా అవుతుంది’’ అంటూ విపక్ష పార్టీకి చెందిన టెలి1 చానల్ లో ఆమె వ్యాఖ్యానించారు. లైవ్ లో ఆమె చేసిన వ్యాఖ్యలపై అధికారపక్షం భగ్గుమంది.

సదరు మహిళా జర్నలిస్టు చేసిన వ్యాఖ్యపై దేశాధ్యక్షుడికి చెందిన ప్రధాన ప్రతినిధి ఫహ్రెటిన్ ఆల్టున్ మాట్లాడుతూ.. ఆమె వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమైనవని.. విద్వేషాన్ని వ్యాప్తి చేయటం తప్పించి మరే ధ్యేయటం లేదని తేలిందన్నారు. జర్నలిస్టు అని చెప్పుకునే ఒక వ్యక్తి తమ దేశాధ్యక్షుడ్ని మొహమాటం లేకుండా అవమానించారని పేర్కొన్నారు. అయితే.. దేశాధ్యక్షుడ్ని అవమానించే ఉద్దేశం తనకు లేదని.. సదరు మహిళా జర్నలిస్టు కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

అయితే.. ఆమెపై నమోదు చేసిన అభియోగం నిరూపితమైతే.. ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు జైలుశిక్ష పడే వీలుందని చెబుతున్నారు. అయితే.. చానల్ లైవ్ లో సామెత చెప్పటం ద్వారా అధికార పక్షానికి మంట పుట్టేలా చేసిన సదరు మహిళా జర్నలిస్టును అర్థరాత్రి రెండు గంటల వేళలో అదుపులోకి తీసుకోవటం.. అనంతరం అరెస్టు చేసి.. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లోని జైలుకు తరలించటం జరిగిపోయాయి.

ఇదిలా ఉంటే.. ఆమె అరెస్టును జర్నలిస్టు వర్గాలు తీవ్రంగా తప్ప పడుతున్నాయి. ఇక..ఈ ఉందంతంపై టెలి 1 చానల్ ఎడిటర్ మెర్డాన్ యానార్డాగ్ మాట్లాడుతూ.. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యమైన పద్దతి కాదన్నారు. అర్థరాత్రి 2 గంటల వేళలో అరెస్టు చేయాల్సిన అవసరం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. టర్కీ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎర్డొగన్ తనను అవమానించారన్నపేరుతో ఇప్పటికే వేలాది కేసులు నమోదు చేయిస్తారన్న విమర్శ ఉంది.