Begin typing your search above and press return to search.

సోష‌ల్ మీడియాలో హ‌ద్దులు దాటితే జైలుకే..!

By:  Tupaki Desk   |   25 April 2017 7:16 AM GMT
సోష‌ల్ మీడియాలో హ‌ద్దులు దాటితే జైలుకే..!
X
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఓ రాజకీయ పార్టీని - దానికి చెందిన నేతలను కించపరిచేలా ఫేస్‌ బుక్‌ లో పోస్టులు పెడుతున్నాడనే కారణంతో ఓ వ్యక్తిని అరెస్టు చేసిన విషయం విదితమే. దీంతో సోషల్ మీడియాతోపాటు, ఇంటర్నెట్‌ లో యూజర్లు చేసే కామెంట్లు - పెట్టే పోస్టుల పట్ల ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. మన దేశంలో ఏ వ్యక్తికైనా తన అభిప్రాయాన్ని చెప్పుకునే భావ ప్రకటనా స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించింది. అలా అని చెప్పి ఇంటర్నెట్ - సామాజిక మాధ్యమాల్లో యూజర్లు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతామన్నా, కామెంట్లు చేస్తామన్నా కుదరదు. ఎందుకంటే భావ ప్రకటనా స్వేచ్ఛకు హద్దులు దాటి ప్రవర్తిస్తే అప్పుడు ఎవరైనా శిక్షార్హులే అవుతారు. ఇంతకీ అసలు ఈ విషయం పట్ల చట్టం మనకు ఏం చెబుతోంది..? ఇలాంటి విషయాల్లో హద్దులు దాటితే చట్ట ప్రకారం ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది..? ఇవీ వివ‌రాలు

ఫేస్‌ బుక్ - ట్విట్టర్ - వాట్సప్‌ ల‌లో అసభ్య ఫొటో షేర్ చేస్తే..

ఐపీసీ సెక్షన్ 292 కింద శిక్షార్హులవుతారు. ఈ సెక్షన్ ప్రకారం అసభ్యకరమైన అంశాన్ని (వీడియో - ఫొటో - టెక్ట్స్ ఏదైనా సరే) షేర్ చేస్తే 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అదే ఇలాంటి పని మళ్లీ చేస్తే అప్పుడు ఏకంగా 5 ఏళ్ల పాటు జైలు.

ఏదైనా మతాన్ని కించపరుస్తూ కామెంట్ - పోస్ట్ పెడితే..?

సున్నిత‌మైన మ‌త‌ర‌ప‌ర‌మైన అంశాల్లో మొదట ఐటీ చట్టం కింద కేసు పెడతారు. ఆ తరువాత మతానికి సంబంధించిన అంశం గనక 295 సెక్షన్ పెడతారు. ఒక వేళ ఇలాంటి విషయాల్లో అవతలి వారి పరువుకు భంగం కలిగితే సెక్షన్ 499 కింద కేసు న‌మోదు అవుతుంది.

అనుమతి లేకుండా వ్యక్తి ఫొటో వాడితే..?

అవతలి వ్యక్తి అనుమతి లేకుండా ఎవరైనా అతని/ఆమె ఫొటోను వాడుకుంటే ఐటీ చట్టం సెక్షన్ 499 కింద కేసు పెడతారు. ఫొటోను వాడారు కనుక చీటింగ్ కేసు పెడతారు. అలాగే మార్ఫింగ్ చేస్తే ఆ కేసు కూడా పెట్టేందుకు అవకాశం ఉంటుంది.

నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే..?

ఫేస్‌ బుక్ - ట్విట్టర్‌ లలో నకిలీ ప్రొఫైల్స్ ఎక్కువగా క్రియేట్ చేస్తుంటారు. అయితే ఇలా చేస్తే సెక్షన్ 499 కింద కేసు పెడతారు. అలాగే ఐటీ చట్టం సెక్షన్ 66డి కింద కూడా కేసు పెడతారు.

ఇతరుల వైఫైని దుర్వినియోగిస్తే..?

ఐటీ చట్టంలో సెక్షన్ 66 కింద కేసు పెడతారు. ఇందులో ఉండే సబ్ సెక్షన్ల ప్రకారం కూడా కేసులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది.

తప్పించుకోవడం అసాధ్యం..!

నేటి తరుణంలో ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికి లభిస్తోంది. కానీ అందులో చాలా మంది తాము ఏమేం చేస్తున్నా అది ఎవరికీ తెలియదు అని అనుకుంటున్నారు. అయితే అది తప్పు. ఎందుకంటే ఇంటర్నెట్‌ లో ఎవరు ఏం చేసినా అది రికార్డెడ్‌ గా ఉంటుంది. ఈ క్రమంలో తప్పించుకోవడం అసాధ్యం. ఎవరైనా ఏ తప్పు చేసినా దాన్ని బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులు - సైబర్ నిపుణులు తేలిగ్గా ట్రాక్ చేయగలుగుతారు. ఫోన్ లేదా కంప్యూటర్ ఏది వాడినా అందులో ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే దానికి ఉండే ఐపీ అడ్రస్‌ ను వారు ట్రాక్ చేస్తారు. అందుకోసం నిపుణుల వద్ద పలు టూల్స్ - సాఫ్ట్‌ వేర్లు కూడా ఉంటాయి. ఈ క్రమంలో ఎవరు ఆ తప్పు చేశారో ఇట్టే తెలిసిపోతుంది. కాబట్టి ఇంటర్నెట్‌ లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో కొంత ఒళ్లు దగ్గర పెట్టుకుని కామెంట్లు - పోస్టులు పెట్టడం మంచిది. లేదంటే జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది. లేని తలనొప్పిని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది..!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/