Begin typing your search above and press return to search.

అది జై శంకర్‌ అంటే.. పాకిస్థాన్‌ కు మామాలుగా బుద్ధి చెప్పలేదుగా!

By:  Tupaki Desk   |   5 May 2023 4:37 PM GMT
అది జై శంకర్‌ అంటే.. పాకిస్థాన్‌ కు మామాలుగా బుద్ధి చెప్పలేదుగా!
X
గోవా వేదికగా షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీఓ) సమావేశాలు మే 5న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎస్‌సీవో విదేశాంగ మంత్రుల భేటీ జరిగింది. ఇందులో సభ్యదేశాలు అయిన పాకిస్తాన్, చైనా, రష్యా, తజకిస్తాన్, కిర్గిజస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్‌ దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. పాకిస్తాన్‌ నుంచి ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ పాకిస్థాన్‌ కు ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు. ప్రపంచం కోవిడ్, దాని పర్యవసనాలను ఎదుర్కోవడంలో నిమగ్నమై ఉంటే... మరో వైపు ఉగ్రవాద ముప్పు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతోందని జై శంకర్‌ దుయ్యబట్టారు.

ఉగ్రవాదం దేశాల భద్రతాప్రయోజనాలకు హాని కలిగిస్తోందని జై శంకర్‌ తెలిపారు. భారత్‌ లోకి సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్‌ ఎగదోస్తోందని జైశంకర్‌ ధ్వజమెత్తారు. పాకిస్థాన్‌ కు చైనా సహకారమందిస్తోందని తప్పుబట్టారు. ఉగ్రవాదానికి అన్ని రకాల సహకారాన్ని నిలిపివేయాలని పిలుపునిచ్చారు. తాలిబన్లు అధికారంలో కి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌ లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తమకు తెలుసని జైశంకర్‌ చెప్పారు.

కోవిడ్‌–19 మహమ్మారి, ఆర్థిక మాంద్యం తదితర కారణాలతో ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని జై శంకర్‌ తెలిపారు. కోవిడ్‌ తో ప్రపంచంలో పంపిణీ వ్యవస్థ దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావంతో ఇంధనం, ఆహారం, ఎరువులపై తీవ్ర ప్రభావం పడిందని చెప్పారు. ఈ సవాళ్లను ఎస్‌సీవో సభ్యదేశాలు సమిష్టిగా పరిష్కరించడానికి ఒక అవకాశం ఏర్పడిందని తెలిపారు. ప్రపంచ జనాభాలో 40 శాతానికి పైగా ఎస్‌ సీఓ సభ్యదేశాల్లోనే ఉందని జైశంకర్‌ ఈ సందర్భంగా వివరించారు.

కాగా విదేశాంగశాఖ మంత్రుల సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాక్‌ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీకి... విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌ షేక్‌ హ్యాండ్‌ ఇవ్వలేదు. నమస్తే అంటూ స్వాగతం చెప్పారు. కాగా బిలావల్‌ భుట్టో జర్దారీ గత 12 సంవత్సరాల్లో భారతదేశాన్ని సందర్శించిన మొట్టమొదటి పాక్‌ విదేశాంగ మంత్రిగా రికార్డు సృష్టించారు.