Begin typing your search above and press return to search.

64 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ సీటు సాధించారు

By:  Tupaki Desk   |   27 Dec 2020 4:15 AM GMT
64 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ సీటు సాధించారు
X
వయసు శరీరానికే కానీ మనసుకు కాదన్న మాట కొందరి నోట వినిపిస్తూ ఉంటుంది. సాధించాలి? ఏదో ఒకటి చేయాలన్న తపన ఉండాలే కానీ.. ఏదీ అసాధ్యం కాదు. ఈ విషయం తాజాగా ఒక రిటైర్డు బ్యాంకు ఉద్యోగిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. సంసార బాధ్యతలతో మునిగితేలిన ఒడిశాకు చెందిన పెద్ద మనిషి.. తాను కలలు కన్నా ఎంబీబీఎస్ సీటును సాధించిన వైనం స్ఫూర్తివంతమని చెప్పక తప్పదు. ఈయన గురించి తెలిసినంతనే నిలువెత్తు ఉత్సాహం.. అంతకు మించిన కొత్త అనుభూతి సొంతం కావటం ఖాయం.

ఒడిశాకు చెందిన జై కిశోర్ ప్రధాన్ వయసు 64 ఏళ్లు. రిటైర్డు బ్యాంకు ఉద్యోగి. ఇంత వయసులో.. ‘వయసైపోయింది. నేనేం చేయగలను’ లాంటి రోటీన్ డైలాగులు ఆయన నోటి నుంచి వచ్చేవి కావు. తాను ఎంబీబీఎస్ చదవాలనుకున్నా.. బాధ్యతల బరువుతో సాధ్యం కాలేదు. 2016లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన ఎంబీబీఎస్ చేరేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. చివరకుతాను అనుకున్నది సాధించారు.

ఎంబీబీఎస్ లో చేరాలన్న పట్టుదల ఆయన ప్రయత్నాన్ని సాధించేళా చేసింది. ఆ మధ్యన రాసిన నీట్ పరీక్షలో ఆయన 175 మార్కుల్ని సాధించారు. దీంతో జాతీయ స్థాయిలో ఆయనకు 5,94,380 స్కోర్ ను సొంతమైంది. దీంతో.. ఆయన కల సాకారమైంది. ఒడిశాలోని బర్లాలోని వీర్ సురేంద్ర సాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కాలేజీలో నాలుగేళ్ల ఎంబీబీఎస్ కోర్సులో చేరారు. 1970లో ఇంటర్ అయ్యాక ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసినా.. ఫలితం దక్కలేదు. అప్పటి నుంచి మెడిసిన్ చేయాలన్న కోరిక ఆయనలో అలానే ఉండిపోయింది.

2019లో సుప్రీంకోర్టు నీట్ పరీక్షకు వయో పరిమితిని తాత్కాలికంగా ఎత్తివేయటంతో ప్రధాన్ కల సాకారమయ్యే అవకాశం లభించింది. ఆయన కుమార్తెలు ఇద్దరు నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు. వారిని చదివిస్తూ.. తాను చదివేవారు. ఇటీవల ఆయన కుమార్తెల్లో ఒకరు మరణించారు. దీంతో.. తీవ్ర విషాదంలోకి ప్రధాన కుటుంబం మునిగిపోయింది. తన కూతురు గుర్తుగా ఎంబీబీఎస్ చదవనున్నట్లుగా ప్రధాన్ చెబుతున్నారు. ఈ పెద్దాయనకు హేట్సాఫ్ చెప్పాల్సిందే.