Begin typing your search above and press return to search.

చిత్తూరు పోలీస్‌స్టేష‌న్‌లో `జై భీమ్‌` ఘ‌ట‌న‌.. జ‌గ‌న్ ఏం చేస్తారు?

By:  Tupaki Desk   |   23 Jan 2022 2:30 AM GMT
చిత్తూరు పోలీస్‌స్టేష‌న్‌లో `జై భీమ్‌` ఘ‌ట‌న‌.. జ‌గ‌న్ ఏం చేస్తారు?
X
ఇటీవ‌ల వ‌చ్చిన `జై భీమ్‌` సినిమా త‌ర‌హా చిత్తూరులో రియ‌ల్‌గా చోటు చేసుకుంది. ఆ సినిమాలో ఎలా అయితే.. దొంగ‌త‌నం పేరుతో ద‌ళితుల‌ను పోలీస్ స్టేష‌న్లో పెట్టి తీవ్రంగా హింసించారో.. అచ్చు అంతేర‌కంగా చిత్తూరులోనూ చోటు చేసుకుంది. అక్క‌డ బాధితుడు పురుషుడు అయితే.. రియల్ ఘ‌ట‌న‌లో మ‌హిళ కావ‌డం గ‌మ‌నార్హం. దీనిపై బాధ‌త మ‌హిళ‌.. మీడియా ద్వారా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు త‌న గోడు వెళ్ల‌బోసుకుంది. వివ‌రాలు.. ఇవీ!

చిత్తూరు జిల్లా చిత్తూరు నగరంలోని లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన ఉమా మహేశ్వరి చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణు గోపాల్ రెడ్డి ఇంట్లో ఏడాది కాలంగా పని చేస్తోంది. వేణు గోపాల్ రెడ్డి ఇంట్లో రూ. రెండు లక్షల నగదు కనిపించక పోవడంతో పని మనిషి ఉమా మహేశ్వరిని ప్రశ్నించారు. నగదు కనిపించక పోవడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఉమా మహేశ్వరి చెప్పినా వినకుండా పోలీసులను పిలిపించారు.

ఈ నెల 18 వ తేదీ చిత్తూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్కు తనను పిలిపించి చేతి వేలి ముద్రలు తీసుకుని పోలీసులు పంపించేసినట్లు ఉమా మహేశ్వరి మీడియాకు తెలిపారు. అనంతరం 19 వ తేదీ తనను మళ్లీ పోలీసు స్టేషన్ కు పిలిచి కాళ్ళు చేతులు కట్టేసి లాఠీలతో తీవ్రంగా కొట్టినట్లు వెల్లడించారు. స్పృహ కోల్పోయే వరకు తనను పోలీసులు కొట్టారని ఆమె తెలిపారు. అనంతరం ఎస్సై వచ్చిన తరువాత తనను పోలీసులు విడిచి పెట్టారని చెప్పారు. తీవ్ర గాయాలపాలైన ఉమా మహేశ్వరి అస్వస్థతకు గురికావడంతో ఆమె భర్త, తల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె వెల్లడించారు.

తనను పలుమార్లు కులం పేరుతో పోలీసులు దూషించారని ఆమె ఆరోపించారు. అనంతరం దొంగతనం సంఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని విచారణలో తెలియడంతో పోలీసులు తనను బుజ్జగించినట్లు చెప్పారు. తనకు తగిలిన గాయాలకు చికిత్స చేయించి పరిహారం ఇస్తామని పోలీసులు చెప్పినట్లు వెల్లడించారు. ఈ విషయం బయట ఎవరికీ చెప్పకూడదని బెదిరించినట్లు ఉమా మహేశ్వరి పేర్కొన్నారు. అకారణంగా తనను దొంగతనం పేరుతో చిత్రహింసలు చేసిన పోలీసులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం చేయాలని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను బాధితురాలు అభ్యర్థించారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. ఎస్సీ మ‌హిళే హోం మంత్రిగా ఉండ‌డం. ఎంత వ‌ర‌కు న్యాయం జ‌రుగుతుందో చూడాలి.