Begin typing your search above and press return to search.

వైసీపీ ఆధిక్యంపై టీడీపీ అసూయ‌ప‌డుతోందే!

By:  Tupaki Desk   |   27 Oct 2017 1:39 PM GMT
వైసీపీ ఆధిక్యంపై టీడీపీ అసూయ‌ప‌డుతోందే!
X
ఏపీ అధికార పార్టీ టీడీపీ.. తీవ్ర రాజ‌కీయ ర‌గ‌డ‌కు తెర‌దీసింది. త‌న‌కు బ‌లం లేద‌ని స్ప‌ష్టం కావ‌డం - విప‌క్షం వైసీపీ గెలుస్తుంద‌ని తెలిసిపోవ‌డంతో కృష్ణాజిల్లా జ‌గ్గ‌య్య‌పేట మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో టీడీపీ తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం సృష్టించింది. దీంతో శుక్ర‌వారం జ‌ర‌గాల్సిన ఎన్నిక చివ‌ర‌కు వాయిదా ప‌డింది. విష‌యంలోకి వెళ్తే.. జగ్గయ్యపేట మున్సిపల్‌ చెర్మన్‌ ఎన్నికకు శుక్ర‌వారం అన్ని ఏర్పాట్లూ చేశారు. అయితే, ఈ ఎన్నిక‌లో త‌మ‌కు బ‌లం లేద‌ని టీడీపీ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది. మెజార్టీ లేకపోవడంతో ఓడిపోతామనే భయంతో ఎన్నిక నిలిపివేయాలని టీడీపీ నేత‌లు ఆందోళనకు దిగారు.

కౌన్సిల్‌ హాల్‌ లోని టేబుళ్లను ఎత్తిపడేశారు. తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌ను రాజేశారు. అయితే, అదేస‌మ‌యంలో ఈ ఎన్నికను ఎట్టి ప‌రిస్థితిలోనూ నిర్వ‌హించాలంటూ వై సీపీ ఇచ్చిన మెమోరాండంను టీడీపీ నేత‌లు చించివేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు యత్నించినా టీడీపీ నేతలు వెన‌క్కి త‌గ్గ‌లేదు. మ‌రోప‌క్క‌ - టీడీపీ కౌన్సిలర్లను వై సీపీ నేతలు కిడ్నాప్‌ చేశారంటూ ఎంపీ కేశినేని నాని - ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యల నేతృత్వంలో హైడ్రామాకు తెరలేపి చైర్మన్‌ ఎన్నిక హాల్‌ లో బారికేడ్లను తొలగించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా పోలీసులపైనే దౌర్జన్యానికి దిగారు. దీంతో చేసేదేమీ లేక రిటర్నింగ్‌ అధికారి...ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తామని ప్రకటన చేశారు.

మరోవైపు టీడీపీ కార్యకర్తలు కార్యాలయం ఎదుట బైక్‌ ను తగులబెట్టారు. దీంతో మున్సిపల్‌ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. టీడీపీ నేతల తీరుపై వైసీపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. ప్రలోభాలతో తమ కౌన్సిలర్లను కొనాలని చూశారని - ఫలించకపోవడంతో ఎన్నిక వాయిదా వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మొత్తం 27 కౌన్సిలర్‌ స్థానాలకు వైసీపీ 16 కైవసం చేసుకోగా - టీడీపీ 10 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఇప్పుడు ఛైర్మ‌న్ ఎన్నిక కీల‌కంగా మారింది. త‌మ‌కు బ‌లం లేనందునే టీడీపీ వీరంగం వేసింద‌ని వైసీపీ నేత‌లు నిప్పులు చెరిగారు. మ‌రి రేపైనా ఎన్నిక ప్ర‌శాంతంగా జ‌రుగుతుందో లేదో చూడాలి.