Begin typing your search above and press return to search.

జగ్గారెడ్డికి కోపం వచ్చింది.. మైక్ విరిగింది

By:  Tupaki Desk   |   29 Jun 2019 1:44 PM GMT
జగ్గారెడ్డికి కోపం వచ్చింది.. మైక్ విరిగింది
X
కాంగ్రెస్ పార్టీ గాని, నేతలు గాని ఏం మారినట్టు కనిపించడం లేదు. ఇప్పటికీ అవే గొడవలు, అవే విధానాలు. త్వరలో పురపాలక ఎన్నికలు రానున్నాయని తెలియడంతో పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయడానికి నాగార్జున సాగర్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసింది. ఈ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు - సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ చోటుచేసుకున్న వాగ్వాదంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మైక్ విసిరేశారు. ఇన్ చార్జిల ఎంపిక విధానమే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది.

మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని ఒక తాటిపై నడిపించడానికి కొత్తగా ఇంఛార్జీలను నియమించాలన్నది ప్రతిపాదన. అయితే జగ్గారెడ్డి ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. స్థానికంగా ఉండే నేతలకు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుస్తాయి. వారిని ప్రోత్సహించకుండా కొత్తవారికి ఇంఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇది పార్టీ నిర్ణయమని చెప్పినా వినిపించుకోని జగ్గారెడ్డి ఎన్నికల్లో గెలవలేని వారు ఎన్నికల్లో ఎలా గెలవాలో అని నిర్ణయాలు తీసుకుంటే ఇక పార్టీ పైకి వచ్చినట్టే అంటూ మైక్ ను విసిరికొట్టారు జగ్గారెడ్డి. జగ్గారెడ్డి తీరుపై పలువురు అసంతృప్తి వ్యక్తంచేయగా, కొందరు నేతలు మద్దతు పలికారు.

నియోజకవర్గ ఎమ్మెల్యేలను మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లుగా కొనసాగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని - క్యాడర్ గురించి అవగాహన ఉంటుంది కాబట్టి పార్టీని విజయతీరాలవైపు నడిపించడం సులువు అని అభిప్రాయపడ్డారు జగ్గారెడ్డి. వాస్తవానికి జగ్గారెడ్డి వాదన కొంతవరకు నిజమే. ఎవరో కొత్తవారిని తెచ్చి ఇన్ చార్జిగా పెడితే వారు స్థానిక పరిస్థితులను, స్థానిక నేతలను ఎపుడు అర్థం చేసుకుని ముందుకు నడిపించగలరు? ఇది కొంచెం కష్టసాధ్యమే. ఏదేమైనా... కాంగ్రెస్ పార్టీలో ఏ ఎన్నికలు వచ్చినా ఈ గొడవలు, అల్లర్లు కామన్ అయిపోతున్నాయి.