Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను పొగుడుతాడు..పీసీసీ చీఫ్ అవుతానంటాడు!

By:  Tupaki Desk   |   3 Nov 2019 1:30 AM GMT
కేసీఆర్‌ ను పొగుడుతాడు..పీసీసీ చీఫ్ అవుతానంటాడు!
X
సంగారెడ్డి ఎమ్మెల్యేగా కంటే...తూర్పు జయప్రకాష్ రెడ్డి అనే అస‌లు పేరుకంటే....అలియ‌స్ పేర‌యిన‌ జ‌గ్గారెడ్డితోనే ఓ రేంజ్‌ లో పాపుల‌ర్ అయిన ఫైర్ బ్రాండ్ నేత జ‌గ్గారెడ్డి మ‌ళ్లీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.జ‌గ్గారెడ్డి ఒకప్పుడు కేసీఆర్‌ పై తీవ్ర విమర్శలు చేసిన ఇటీవ‌ల వ‌రుస‌గా పొగడ్తల్లో ముంచెత్తారు. దీంతో మ‌రి కొద్దిమంది ఎమ్మెల్యేలతో క‌లిసి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్ప‌నున్నార‌ని - టీఆర్ ఎస్‌ లో చేర‌నున్నార‌ని ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే - ఆ చ‌ర్చ కొద్దికాలం త‌ర్వాత‌ ఆగిపోయింది. క‌ట్ చేస్తే..తాజాగా ఓ మీడియా సంస్థ‌తో జ‌గ్గారెడ్డి మాట్లాడుతూ...టీఆర్ ఎస్‌ లో చేర‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింద‌ని...అయితే పార్టీ మార‌వ‌ద్ద‌ని త‌న కూతురు సల‌హా ఇవ్వ‌డంతో ఆగిపోయాన‌ని వెల్ల‌డించారు. తాజాగా...త‌న‌కు పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి కావాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

జగ్గారెడ్డి తాజాగా మీడియాతో చిట్ చాట్ చేస్తూ...ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. పీసీసీ అధ్య‌క్షుడి మార్పు జరుగనుందని ఢిల్లీ నుండి బాగా ప్రచారం జరుగుతుందని పేర్కొంటూ...ఈ లీకులు క‌నుక నిజమైతే మునిసిపల్ ఎన్నికల తర్వాత పీసీసీ ర‌థసార‌థిని మార్చాలని సూచించారు. ఇప్పుడు పీసీసీ రేసులో ఉన్నవారు అందరు సమర్థులేన‌ని జ‌గ్గారెడ్డి అన్నారు. హై కమాండ్ ఎవరికి పీసీసీ నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతానికి...నేత‌లందరం కలసి పని చేయాల్సి ఉంటుంద‌ని జ‌గ్గారెడ్డి స్ప‌ష్టం చేశారు.

ఇదే సంద‌ర్భంగా ప‌ద‌వి ప‌ట్ల‌ త‌న మ‌న‌సులోని మాట‌ను జ‌గ్గారెడ్డి బ‌య‌ట‌పెట్టారు. పీసీసీ నాయ‌క‌త్వ మార్పిడి ఎప్పుడు జరిగినా పీసీసీ చీఫ్ రేసులో తాను కూడా ఉన్నానని ప్ర‌క‌టించారు. త‌నకు అవకాశం ఇస్తే పార్టీ బలోపేతానికి కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ నెల 17 న ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్ర‌నేత‌లైన‌ సోనియా గాంధీ - రాహుల్ గాంధీ - అహ్మద్ పటేల్ - కేసి వేణుగోపాల్ ను కలుస్తానని జ‌గ్గారెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని వెల్ల‌డించారు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే పథకాల కంటే అద్భుత పథకాలు త‌న దగ్గర ఉన్నాయని జ‌గ్గారెడ్డి వెల్ల‌డించారు. సీఎం పదవి ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తాన‌ని జ‌గ్గారెడ్డి ప్ర‌క‌టించారు.