Begin typing your search above and press return to search.

జ‌గ్గారెడ్డి ఎఫెక్ట్‌!... గులాబీలో ల‌డాయేనా?

By:  Tupaki Desk   |   5 Feb 2019 5:10 PM GMT
జ‌గ్గారెడ్డి ఎఫెక్ట్‌!... గులాబీలో ల‌డాయేనా?
X
తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి.... అంద‌రికీ జ‌గ్గారెడ్డిగా చిర‌ప‌ర‌చితులైన కాంగ్రెస్ పార్టీ నేత‌ - సంగారెడ్డి ఎమ్మెల్యే త‌న‌దైన శైలి వ్యాఖ్య‌ల‌తో అదికార పార్టీ టీఆర్ ఎస్‌ లో చిచ్చు పెట్టేశార‌నే చెప్పాలి. ఎప్పుడు మీడియా ముందుకు వ‌చ్చినా... ఏదో ఒక సంచ‌ల‌న కామెంట్ చేసే అల‌వాటున్న జ‌గ్గారెడ్డి... పొలిటిక‌ల్‌గా టిపిక‌ల్ నేత‌గానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. భాషా - వేషంతో పాటు వ్య‌వ‌హారంలోనూ భిన్నంగా వ్య‌వ‌హ‌రించే జ‌గ్గారెడ్డి.. మొన్న‌టి ఎన్నిక‌ల‌కు ముందు టీఆర్ ఎస్‌ పైనా - ఆ పార్టీ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు ఫ్యామిలీపై సంచ‌ల‌న కామెంట్లు చేసి ఎన్నిక‌ల వేడిని తారాస్థాయికి పెంచేశారు. జ‌గ్గారెడ్డి చేసిన వ్యాఖ్య‌లు విన్న‌వారంతా... టీఆర్ ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చిందంటే... ఆయ‌న ప‌ని అయిపోయిన‌ట్టేన‌ని కూడా అనుకున్నారు. అయితే అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ... టీఆర్ ఎస్ అధికారంలోకి రాగానే జ‌గ్గారెడ్డి త‌న వాయిస్‌ ను మార్చేశారు. అప్ప‌టిదాకా టీఆర్ ఎస్‌ పై సంచ‌ల‌న కామెంట్ల‌ను చేసిన జ‌గ్గారెడ్డి... ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీని ఆకాశానికెత్తుతూ తాను సేఫ్ జోన్‌ లోకి వెళ్లిపోయారు. అయితే ఇందులోనూ జ‌గ్గారెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. కేసీఆర్ ఫ్యామిలీని పొగ‌డుతూనే... కేసీఆర్ మేన‌ల్లుడు - టీఆర్ ఎస్‌ లో కీల‌క నేత‌గా ఎదిగిన త‌న్నీరు హ‌రీశ్ రావుపై త‌న‌దైన శైలి ఘాటు వ్యాఖ్య‌ల‌ను చేశారు.

కేసీఆర్ త‌న‌యుడు - టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావును నిజాయ‌తీప‌రుడిగా అభివ‌ర్ణించేసిన జ‌గ్గారెడ్డి... హ‌రీశ్ రావును మాత్రం బ్లాక్ మెయిల‌ర్‌గా తేల్చేశారు. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌ల‌తో జ‌గ్గారెడ్డి... తాను లేని పార్టీలో నిజంగానే పెద్ద కుంప‌టిని రాజేశారని చెప్పాలి. కేసీఆర్ - కేటీఆర్ - క‌విత‌ల‌ను పొగిడి త‌న భ‌విష్య‌త్తుకు ఎలాంటి ప్ర‌మాదం రాకుండా చూసుకున్నంత వ‌ర‌కు ఫ‌ర‌వా లేదు గానీ.. అన‌వ‌స‌రంగా హ‌రీశ్ రావు ప్ర‌స్తావ‌న తెచ్చి... ఆయ‌న‌ను మాత్రం బ్లాక్ మెయిల‌ర్‌ గా అభివ‌ర్ణించ‌డం చూస్తుంటే... జ‌గ్గారెడ్డి వ్యాఖ్య‌ల వెనుక ఏదో కుట్ర దాగుంద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ త‌ర‌హాలో జ‌గ్గారెడ్డి చేసిన వ్యాఖ్య‌ల వెనుక కేసీఆర్ ఫ్యామిలీ పాత్ర ఉందా? అన్న అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్న ప‌రిస్థితి. మొత్తంగా జ‌గ్గారెడ్డి త‌న వ్యాఖ్య‌ల‌తో ఇప్పుడు టీఆర్ ఎస్‌ లో పెద్ద కుంప‌టినే రాజేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయినా కేసీఆర్ నామ‌స్మ‌ర‌ణ‌లో త‌రిస్తున్న జ‌గ్గారెడ్డి... హ‌రీశ్ రావు పేరెందుకు ఎత్తాల్సి వ‌చ్చింద‌న్న విష‌యంపై ఇంకో వాద‌న కూడా వినిపిస్తోంది.

సంగారెడ్డిలో జ‌గ్గారెడ్డికి మంచి ప‌ట్టుంది. ఎంత పెద్ద నేత‌లు బ‌రిలోకి దిగినా.. సంగారెడ్డిలో జ‌గ్గారెడ్డిని ఎదుర్కోవ‌డ‌మంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే.. రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి సంగారెడ్డి వేదిక‌గానే బ‌రిలోకి దిగుతున్న జ‌గ్గారెడ్డి... అక్క‌డి ప్ర‌జ‌ల్లో మంచి ఇమేజీని సంపాదించుకున్నారు. తెలంగాణ ఉద్య‌మం ఉధృతంగా సాగుతున్న స‌మ‌యంలోనూ సంగారెడ్డిలో టీఆర్ ఎస్ ఆట‌లు సాగ‌లేదు. ఒకానొక స‌మ‌యంలో సంగారెడ్డికి వ‌చ్చిన హ‌రీశ్ రావును ఎదిరించేసిన జ‌గ్గారెడ్డి... ఏకంగా న‌డిరోడ్డుపై హ‌రీశ్ మీద‌కు దూసుకెళ్లారు. మ‌రోవైపు సంగారెడ్డిలో త‌మ‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారిన జ‌గ్గారెడ్డిని ఎలాగైనా దెబ్బ కొట్టాల‌ని హ‌రీశ్ రావు ద్వారా కేసీఆర్ చాల ప్ర‌ణాళిక‌లే అమ‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే ఓ ప‌ర్యాయం ఏకంగా జ‌గ్గారెడ్డి అరెస్ట్ కూడా అయ్యారు. త‌న‌ను అరెస్ట్ చేయించింది హ‌రీశ్ రావేన‌న్న‌ది జ‌గ్గారెడ్డి అనుమానం. ఈ క్ర‌మంలో జ‌గ్గారెడ్డి, హ‌రీశ్ రాజ‌కీయంగా బ‌ద్ధ విరోధులుగా మారిపోయారు. ఈ క్ర‌మంలోనే హ‌రీశ్ రావుపై జ‌గ్గారెడ్డి ఆ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌న్న‌ది ఈ రెండో వాద‌న‌గా వినిపిస్తోంది. ఏది ఏమైనా... టీఆర్ఎస్‌లో కీల‌క నేత‌లుగా ఉన్న కేటీఆర్‌, హ‌రీశ్ రావుల పేర్ల‌ను ప్ర‌స్తావించిన జ‌గ్గారెడ్డి... వారిలో ఒక‌రిని నిజాయ‌తీ ప‌రుడిగా, మ‌రొక‌రిని బ్లాక్ మెయిల‌ర్‌గా అభివర్ణించడం చూస్తుంటే... దీని వెనుక ఏదో పెద్ద ప్ర‌ణాళికే ఉంద‌న్న అనుమానాలు అయితే వ్యక్త‌మ‌వుతున్నాయి.