Begin typing your search above and press return to search.

జ‌గ్గారెడ్డి లాజిక్‌ కు కేసీఆర్ అబ్బా అనాల్సిందే!

By:  Tupaki Desk   |   3 Dec 2019 1:41 PM GMT
జ‌గ్గారెడ్డి లాజిక్‌ కు కేసీఆర్ అబ్బా అనాల్సిందే!
X
తెలంగాణ‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ ఆర్టీసీ) స‌మ్మె విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యంపై ఓ వైపు ప్ర‌శంస‌లు కురుస్తూనే...మ‌రోవైపు విమ‌ర్శ‌ల పరంప‌ర కూడా కొన‌సాగుతోంది. కిలోమీటర్‌ కు 20 పైసల చొప్పున పెంచడానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనుమతించడంతో ఆర్టీసీ యాజమాన్యం.. బస్సులవారీగా పెంచిన చార్జీలను ప్రకటించింది. పల్లెవెలుగు - ఆర్డినరీ - డీలక్స్‌ - సూపర్‌ లగ్జరీ - రాజధాని - వజ్ర - గరుడ - గరుడ ప్లస్‌ - వెన్నెల వంటి అన్ని రకాల బస్సుల్లో చార్జీలను పెంచినట్లు సోమవారం సర్క్యులర్‌ విడుదల చేసింది. కనీస చార్జీల్లో మార్పు చేయడంతో పాటు పెరిగిన చార్జీలకు అనుగుణంగా బస్‌ పాసుల చార్జీల్లోనూ మార్పు చేసినట్లు పేర్కొంది. అయితే, దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను ఇర‌కాటంలో ప‌డేసేలా ఆర్టీసీ చార్జీల పెంపుపై జ‌గ్గారెడ్డి సూటి ప్ర‌శ్న‌లు వేశారు. సీఎల్పీ కార్యాలయంలో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ...ఆర్టీసీ స‌మ్మె ముగియ‌డం సంతోష‌క‌ర‌మ‌ని అన్నారు. అయితే, ఆర్టీసీ సమ్మె సమస్య పోయిందనుకుంటే.. చార్జీల పెంపు రూపంలో మరో సమస్యను సీఎం కేసీఆర్‌ తెరపైకి తెచ్చారని మండిప‌డ్డారు. రాష్ట్రవిభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నప్పటికీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని.. ఛార్జీలు కూడా పెంచలేదని గుర్తు చేశారు. మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణలో మాత్రం ఆర్టీసీని విలీనం చేయకపోగా ఛార్జీలు పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.

ఆర్టీసీ ఛార్జీల పెంపును ప్రభుత్వం తక్షణమే ఉపసహరించుకోవాలని జ‌గ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. . ఛార్జీల తగ్గింపు కోసం సంతకాల సేకరణ చేస్తామన్నారు. పెంచిన ఛార్జీలను తగ్గించకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తగ్గించటంతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగ్గారెడ్డి అన్నారు.