Begin typing your search above and press return to search.

ముందు ఒక్క హరీశ్ పని చూడు జగ్గా?

By:  Tupaki Desk   |   10 April 2016 4:32 AM GMT
ముందు ఒక్క హరీశ్ పని చూడు జగ్గా?
X
ఓపక్క టీఆర్ ఎస్ లో చేరేది లేదని బల్లగుద్ది చెబుతూనే.. తాను కానీ టీఆర్ ఎస్ పార్టీలో చేరితే మంత్రి హరీశ్ రావు ఆటలు ఆగిపోతాయంటూ బడాయి మాటలు చెబుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేసీఆర్ అంటే అస్సలు గిట్టనట్లుగా వ్యవహరించటం.. తెలంగాణ ఉద్యమం ఓ రేంజ్ లో సాగుతున్న వేళ.. సమైక్యవాదాన్ని వినిపించిన ఏకైక తెలంగాణ నాయకుడిగా జగ్గారెడ్డికి పేరుంది. వైఎస్ కు అపర భక్తుడిగా ఉన్న జగ్గారెడ్డి.. హరీశ్ మాట ఎత్తితే చాలు.. అగ్గి మీద గుగ్గిలం అయిపోతారు.

తాజాగా చోటు చేసుకున్న వలసల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ ఎస్ లో జగ్గారెడ్డి చేరటం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన జగ్గారెడ్డి.. తన ప్రాణం పోయేంతవరకూ తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని చెప్పుకొచ్చారు. టీఆర్ ఎస్ ను మునుగుతున్న పడవగా అభివర్ణించిన ఆయన.. తాను కానీ టీఆర్ ఎస్ లో చేరితే హరీశ్ రావు ఆటలు ఆగిపోతాయన్నారు.

తనను బద్నాం చేసేందుకే టీఆర్ ఎస్ లో చేరుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీజేపీలో చేరటమే తాను చేసిన అతి పెద్దగా ఆయన చెప్పుకున్నారు. ఇకపై తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని.. పది మంది హరీశ్ రావులు ఎదురైనా సంగారెడ్డిలో తనదే విజయమంటూ ఆత్మవిశ్వాసాన్నిప్రదర్శిస్తున్నారు జగ్గారెడ్డి. పదిమంది హరీశ్ రావుల దాకా ఎందుకు ఉన్న ఒక్క హరీశ్ రావు మీద అధిక్యం సాధించాక జగ్గారెడ్డి మాట్లాడితే బాగుంటుందేమో..?