Begin typing your search above and press return to search.

జ‌గ్గారెడ్డి..కోమ‌టిరెడ్డి..ఇద్ద‌రూ ఎందుకిలా?

By:  Tupaki Desk   |   3 Nov 2019 12:25 PM GMT
జ‌గ్గారెడ్డి..కోమ‌టిరెడ్డి..ఇద్ద‌రూ ఎందుకిలా?
X
ఆ ఇద్ద‌రూ ఫైర్‌ బ్రాండ్ నేత‌లు. వారు స్పందిస్తే...వార్త ప‌తాక శీర్షిక‌ల్లోకి ఎక్కాల్సిందే. అది అధికార టీఆర్ ఎస్ పార్టీ అయినా...ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఇత‌ర పార్టీలపై అయినా....ఆఖ‌రికి సొంత పార్టీ అయినా. అలా త‌మ‌కంటూ ఓ విభిన్న‌మైన వ్య‌క్తిత్వంతో ముందుకు సాగిన ఆ ఇద్ద‌రు నేత‌లు ఇప్పుడు డైలామాలో ప‌డిపోయారా లేక అనుచ‌రులు - ప్ర‌జ‌ల‌ను డైలామాలో ప‌డేస్తున్నారా అనేది అర్థం కాని ప‌రిస్థితి. ఆ ఇద్ద‌రే....కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి - రాజ్‌ గోపాల్ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీలో పైర్‌ బ్రాండ్ నేత‌లుగా సుప‌రిచితులు అయిన ఈ ఇద్ద‌రు నేత‌లు ఇప్పుడు భ‌జ‌న కార్య‌క్ర‌మంలో మునిగిపోయారు. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అన్న‌ట్లుగా...తాము ఉన్న‌ది ఒక పార్టీ అయితే...ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అంటే.... ఒకప్పుడు ఓ రేంజ్‌లో టార్గెట్ చేసిన‌ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇప్పుడు స్టాండ్ మార్చేశారు. రెండు - మూడు నెలలుగా గులాబీ ద‌ళ‌ప‌తిని పొగ‌డ‌టంలో ఆయ‌న బిజీగా ఉన్నారు. ఒక్క ఆర్టీసీ అంశం మినహాయిస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని జగ్గారెడ్డి పలు అంశాలపై ఆకాశానికెత్తేశారు. తరచూ ప్రభుత్వాన్ని పొగుడుతూ.. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసమే అంటూ ఆఖ‌రికి...చిరకాలంగా వ్యతిరేకిస్తున్న హరీశ్ రావుతోను జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఇలా ట్విస్టులు ఇస్తున్న‌ జగ్గారెడ్డి తాజా ప్ర‌క‌ట‌న ఏంటంటే....తాను పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో ఉన్నానని ప్ర‌క‌టించ‌డం.

కాంగ్రెస్ కంచుకోట‌గా పేరున్న న‌ల్ల‌గొండ జిల్లాలో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ అనే పేరు పొంది ఫైర్‌బ్రాండ్ నేత‌లుగా గుర్తింపు పొందిన కోమ‌టిరెడ్డి రాజ్‌ గోపాల్ రెడ్డి కూడా అయోమ‌యం సృష్టిస్తున్నారంటున్నారు. బీజేపీ ప్రభుత్వంపై ఆయ‌న గ‌త కొద్దికాలంగా ప్రశంసలు కురిపించారు. ఇక పార్టీ మార‌డ‌మే లేటు అనుకున్న త‌రుణంలో....తాజాగా రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్‌ ను ఆకాశానికి ఎత్తేశారు. దండు మ‌ల్కాపూర్‌ ఇండస్ట్రియల్ పార్క్‌ కోసం తక్కువ ధరలకే భూములిచ్చేలా రైతులను ఒప్పించిన కేటీఆర్ లాంటి డైనమిక్ లీడర్ ఉండటం తెలంగాణ అదృష్టమని బ‌హిరంగ స‌భ వేదిక‌గా భ‌జ‌న చేశారు. ఇలా ఈ ఇద్ద‌రు నేత‌లు..ఉన్న‌ది ఒక పార్టీలో..చేస్తున్న‌ది మ‌రొక పార్టీ భ‌జ‌న కావ‌డంతో...కాంగ్రెస్ శ్రేణులు..వీరి వ్యూహాల‌ను అర్థం చేసుకోలేక‌పోతున్నాయి.