Begin typing your search above and press return to search.

ముస్లిం ఓటు బ్యాంకుపై జగన్ దృష్టి.. రెండో అధికార భాషగా ఉర్దూ

By:  Tupaki Desk   |   17 Jun 2022 11:32 AM GMT
ముస్లిం ఓటు బ్యాంకుపై జగన్ దృష్టి.. రెండో అధికార భాషగా ఉర్దూ
X
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు గెలుపొందడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఆయా మతాలను, కులాలను మచ్చిక చేసే పనులను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ముస్లింలను ఆకట్టుకునే చర్యలు చేపట్టారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 26 జిల్లాల్లో ఉర్దూను రెండో అధికార భాషగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషల చట్ట సవరణ-2022కు సంబంధించి మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఉర్దూకు రెండో అధికార భాష హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికార కార్యకలాపాలు, ఉత్తర, ప్రత్యుత్తరాలను తెలుగుతో పాటు ఉర్దూలోనూ సాగించేలా సమాన హోదా కల్పించినట్టైంది.

వాస్తవానికి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా కొనసాగింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉర్దూకు రెండో అధికార భాషగా చట్టబద్ధత కల్పించింది. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లూ దీన్ని పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. మైనార్టీలు, ఉర్దూ ప్రేమికుల ఆవేదనను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉర్దూకు స్థానం కల్పించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇప్పుడు ఉర్దూకు రెండో అధికార భాషగా స్థానం కల్పించడంతో ముస్లింలను ఆకట్టుకోవచ్చని వైఎస్సార్సీపీ తలపోస్తోంది. ఇప్పటికే జగన్ కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా ముస్లిం వర్గానికి చెందిన అంజాద్ బాషా ఉన్నారు.

అలాగే శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా జకియా ఖానం అనే మహిళకు అవకాశమిచ్చారు. అలాగే విజయవాడ నుంచి రుహుల్లాకు ఎమ్మెల్సీగా చాన్స్ ఇచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ పట్ల ముస్లింలను ఆకర్షించవచ్చని వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా రాష్ట్ర రెండో అధికార భాషగా ఉర్దూకు స్థానం కల్పించారు.