Begin typing your search above and press return to search.

రేపే ‘జగనన్న విద్యా కానుక’ .. ప్రారంభించున్న సీఎం జగన్

By:  Tupaki Desk   |   7 Oct 2020 11:10 AM GMT
రేపే ‘జగనన్న విద్యా కానుక’ .. ప్రారంభించున్న సీఎం జగన్
X
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని చేపడుతున్న కార్యక్రమం జగనన్న విద్యాకానుక. ఈ పథకాన్ని ఈనెల 8 న కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జడ్పీ హైస్కూలులో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 10.20 గంటలకు జడ్పీ హైస్కూలుకు సీఎం చేరుకుని… స్కూల్ విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడతారు. ఆ తర్వాత విద్యాకానుకను ప్రారంభిస్తారు. కరోనా‌ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పరిమిత సంఖ్యలో ప్రజలను మాత్రమే ఈ కార్యక్రమానికి అనుమతించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పాఠశాలల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయనున్నారు. పిల్లలంతా పాఠశాలలకు వచ్చేలా ప్రోత్సహించి చేరికలు పెంచడంతోపాటు అభ్యసన సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో సీఎం జగన్‌ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు విద్యాకానుక కిట్‌లను అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్ధులకు దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో స్టూడెంట్‌ కిట్లు అందచేస్తారు. ప్రతి విద్యార్థికి కిట్‌లో 3 జతల యూనిఫామ్‌లు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్‌ పాఠ్యా పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఒక స్కూల్‌ బ్యాగ్‌ ఉంటాయి. విద్యార్థులకు అందచేసే వస్తువుల నాణ్యతపై ఎక్కడా రాజీ పడకుండా ముఖ్యమంత్రే స్వయంగా అన్నిటినీ పరిశీలించి ఆమోదించారు. ఇక ఈ పథకంకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 91212 96051, 91212 96052 హెల్ప్ ‌లైన్‌ నంబర్లలో సంప్రదించేలా విద్యాశాఖ ఏర్పాట్లు కూడా చేసింది.